
మోడీ–షా ద్వయం నిరంకుశ పాలన: కాంగ్రెస్ ఫైర్
నేషనల్ హెరాల్డ్–అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కేసులో ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఆదివారం కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో పార్టీలో పై స్థాయిలో ఉన్న వారు వ్యక్తిగత లాభాల కోసం తమ పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుత పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు మరో ఏడుగురిపై ఈ ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దుబే, సామ్ పిత్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్, ప్రమోటర్ సునీల్ భండారి, ఏజీఎల్ తదితరులు ఉన్నారు. ఎఫ్ఐఆర్‌లో నేరపూరిత కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, నేరపూరిత నమ్మక ద్రోహానికి శిక్ష, మోసం చేసినందుకు పోలీసులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఈడీ సమర్పించిన చార్జ్‌షీట్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్టోబర్ 3న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేశారు. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 66(2) కింద ఈడీ ఈ ఆధారాలను ఢిల్లీ పోలీసులకు తెలిపింది.
కాంగ్రెస్ అగ్ర నాయకత్వంపై ‘మోడీ-షా ద్వయం’వేధింపులు, బెదిరింపులు, ప్రతీకార చర్యలతో కూడిన దుష్ట రాజకీయాలను కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఆరోపించారు. ఈ చర్యను ఖండిస్తూ నేషనల్ హెరాల్డ్ విషయం ‘పూర్తిగా బూటకపు కేసు’ అని చివరికి న్యాయం గెలుస్తుందని పేర్కొంది.
మోడీ–షా జంట అగ్రనేతలపై నిష్ఠూరమైన కుట్రరాజకీయాలు కొనసాగిస్తోంది. కేసులతో బెదిరిస్తున్న వారే బాగా భయపడుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా తప్పుడు కేసు. సత్యమే శివం… సత్యమే గెలుస్తుంది అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ ఎక్స్ లో విశ్వాసం వ్యక్తం చేశారు.
లేనిది ఉన్నట్లు చెబుతున్నారు
ఇది కొత్త కేసు కాదు… పాతదే. డబ్బు ఎక్కడికి పోలేదు. స్థిర ఆస్తుల బదిలీ లేదు. అయినా మనీలాండరింగ్ జరిగినట్లు తయారు చేశారు. యంగ్ ఇండియన్ ద్వారా ఏజీఎల్ షేర్లను హోల్డ్ చేయడమే తప్ప లాభం పొందడం లేదు. డివిడెండ్ లేదు, ప్రయోజనం లేదు అయినా మనిలాండరింగ్ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అభిషేక్ మను సింగ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తలవంచదు
ఈ ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల పద్దతిలోనే ప్రజాస్వామ్య హక్కులు కబళిస్తోంది. కాంగ్రెస్ ఎప్పుడూ తలవంచలేదు. ఇకముందూ వంచదు. గాంధీ కుటుంబం స్వాతంత్ర్యం కోసం పోరాడింది. ప్రజాస్వామ్యం కోసం పోరాటం ఆగదు అని మరొక సీనియర్ నాయకుడు ప్రమోద్ తివారి హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఈ కేసును పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, చివరికి న్యాయస్థానాల్లో నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌పై తదుపరి విచారణ డిసెంబర్ 16న జరగనుంది.
