
మోడీని అవమానించారని రాహుల్ గాంధీ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ప్రధానిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ గురువారం బీహార్ ప్రధాన ఎన్నికల అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం అక్టోబర్ 29న ముజఫ్ఫర్‌పూర్, దర్బంగా ఎన్నిలక సభల్లో మాట్లాడిన రాహుల్ గాంధీ ‘మోడీ ఓట్ల కోసం డ్యాన్స్ చేస్తాడు’ అని వ్యాఖ్యానించారని పేర్కొంది. ప్రధానమంత్రి పదవికి గౌరవం దెబ్బతీయడం మాత్రమే కాదు, ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య మర్యాదలకు విరుద్ధం అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫిర్యాదులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ ఉల్లంఘనగా పేర్కొంటూ ఆయనపై రిప్రంజేటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 లోని సెక్షన్ 123(4) ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పించాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.
ఇలాంటి వ్యక్తిగత దూషణలకు రాజకీయాల్లో స్థానం ఉండకూడదు. ప్రధానమంత్రి గౌరవాన్ని కించపరచే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది.
రాహుల్ గాంధీ ఇటీవల బీహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. మోదీకి ఓట్లే ముఖ్యమని, ఓట్ల కోసం ఏదైనా చేస్తారని, డ్యాన్స్ కూడా వేయమంటే వేస్తారని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం జోక్యం కోరింది. ఈ ఫిర్యాదుతో బీహార్ లో ఎన్నికల వేడి మరింత పెరిగింది.
