
మోడీ–ట్రంప్ కాల్‌లో ఎలాన్‌మస్క్ పాల్గొన లేదు : భారత్ ఖండన
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో బిలియనీర్ ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను భారత్ ప్రభుత్వం శనివారం ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, మార్చి 24న జరిగిన ఆ సంభాషణ ఇద్దరు నేతల మధ్య మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. ఆ వార్తను మేము గమనించాం. ఆ రోజు జరిగిన టెలిఫోన్ సంభాషణ పూర్తిగా ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మాత్రమే జరిగిందని ఆయన తెలిపారు.
ఇది సంబంధించి అమెరికా పత్రిక ‘ది న్యూ యార్క్ టైమ్స్’ ఒక నివేదిక ప్రచురిస్తూ, మస్క్ కూడా ఆ కాల్‌లో పాల్గొన్నారని, ఇది అసాధారణ పరిణామం అని పేర్కొంది. అయితే, ఆయన ఎందుకు పాల్గొన్నారు లేదా మాట్లాడారా అనే విషయంపై స్పష్టత లేదని ఆ నివేదికలోనే పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన భారత వర్గాలు ప్రధాని మోడీతో మాట్లాడింది ట్రంప్ మాత్రమే. ఆ సంభాషణలో మరెవరూ పాల్గోలేదని స్పష్టం చేశాయి. ఎవరో మరొకరు అక్కడ ఉన్నారా లేదా వినారా అన్నది అమెరికా ప్రభుత్వం చెప్పాల్సిన విషయమని కూడా సూచించాయి. ఈ ఫోన్ కాల్‌ను ట్రంప్ ప్రారంభించారని, ప్రధానంగా పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చించడానికి ఈ సంభాషణ జరిగినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమ ఆసియా ఘర్షణ తరువాత, మోడీ–ట్రంప్ మధ్య ఇదే తొలి సంభాషణగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ప్రపంచ శాంతి, స్థిరత్వం, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హోర్ముజ్ సముద్రపు మార్గం నిరంతరం తెరిచి, సురక్షితంగా ఉండాలని ప్రాముఖ్యతను వెల్లడించినట్లు తెలిపింది.
