
మోకాలే కుట్రలతో భారతీయుల్లో ఆత్మనూన్యతను నాటారు: రాష్ట్రపతి ముర్ము
బ్రిటిష్ పాలన కాలంలో మోకాలే కుట్రల ద్వారా భారతీయుల్లో తక్కువ అనే(ఆత్మనూన్యతను) భావనను నాటారని, స్వాతంత్య్రం తర్వాత తొలిసారి ఆ మానసిక బానిస త్వంపై దెబ్బకొట్టే ధైర్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం చూపిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలంటే ఆధునిక అభివృద్ధితో పాటు జాతీయ ఆత్మగౌరవం, సాంస్కృతిక గర్వానికి సమాన ప్రాధాన్యం అవసరమని ఆమె స్పష్టం చేశారు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశమని, ఆ వారసత్వాన్ని దేశ బలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 125 ఏళ్ల తర్వాత భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలు భారత్‌కు తిరిగి రావడం, వాటిని ప్రజల దర్శనార్థం ఉంచడం గర్వకారణమని చెప్పారు. 2026లో సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని, వెయ్యేళ్ల దాడుల చరిత్ర మధ్య కూడా సోమనాథ్ భారతీయుల ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలిచిందని ముర్ము పేర్కొన్నారు. అలాగే రాజేంద్ర చోళుడి గంగైకొండ చోళపురం స్థాపనకు వెయ్యేళ్లు పూర్తవడం దేశ గర్వాన్ని మరింత పెంచిందన్నారు.
విదేశీ ఆక్రమణలు, స్వాతంత్య్రానంతర నిర్లక్ష్యం కారణంగా ప్రాచీన జ్ఞాన సంపదకు నష్టం జరిగిందని, ‘జ్ఞాన్ భారత్ మిషన్’ ద్వారా ప్రాచీన పాండులిపుల డిజిటలైజేషన్ ప్రారంభమైందని చెప్పారు. గిరిజన సంస్కృతి పరిరక్షణకు గిరిజన మ్యూజియంల ఏర్పాటు, సంతాలి భాషలో రాజ్యాంగ అనువాదం గిరిజనుల గౌరవాన్ని పెంచిందన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో భిన్నాభిప్రాయాలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు ఏకమవాలని, ఇదే భారత రాజ్యాంగ స్ఫూర్తి అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ఇరు సభలు వాయిదా
జనవరి 29 ఉదయం 11 గంటలకు మళ్లీ సమావేశం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజున లోక్‌సభ, రాజ్యసభలు బుధవారం మధ్యాహ్నం వాయిదా పడ్డాయి. ఇరు సభలు జనవరి 29 (గురువారం) ఉదయం 11 గంటలకు మళ్లీ సమావేశం కానున్నాయి. సభలో అధికార ఎన్డీఏ–బీజేపీ సభ్యులు టేబుళ్లను చరుస్తూ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించగా, విపక్ష సభ్యులు లేచి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చట్టాలను ఉపసంహరించాలంటూ విపక్షాలు నినాదాలు చేశాయి. బడ్జెట్ సమావేశాల తొలి రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, ‘వికసిత భారత్’ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికోణాన్ని ఆమె వివరించారు. ఇది 18వ లోక్‌సభ 7వ సమావేశం, రాజ్యసభ 270వ సమావేశంగా కొనసాగుతోంది.
గ్రామీణ ఉపాధి, జీవనోపాధి అంశాలపై మాట్లాడుతూ వికసిత భారత్–ఉపాధి, అజీవిక హామీ మిషన్ (గ్రామీణ) చట్టం – వీబీ-జీ రాం జీ బిల్ అమల్లోకి వచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ చట్టం ద్వారా గ్రామాల్లో 125 రోజుల ఉపాధి హామీ కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది దేశ చరిత్రలో గుర్తుండిపోయే సంవత్సరం అని పేర్కొన్న రాష్ట్రపతి, వందే మాతరం 150 ఏళ్లు, గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీద్ దివస్, బిర్సా ముండా 150వ, సర్దార్ పటేల్ జయంతి కార్యక్రమాలు దేశ ఐక్యతను మరింత బలపరిచాయని అన్నారు. భూపెన్ హజారికా జయంతి వేడుకలు దేశాన్ని సంగీతం, ఐక్యతతో నింపాయని చెప్పారు.
సామాజిక న్యాయంపై దృష్టి సారించిన రాష్ట్రపతి, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రస్తావించిన సమానత్వ విలువలు రాజ్యాంగంలో నిక్షిప్తమై ఉన్నాయని గుర్తు చేశారు. గత దశాబ్దంలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రస్తుతం 95 కోట్ల మందికి సామాజిక భద్రతా పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ముందు ఆమెకు పార్లమెంట్ ప్రాంగణంలో గౌరవ వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. సమావేశాల తొలి రోజున ఇరు సభలు మాజీ బంగ్లాదేశ్ ప్రధాని ఖాలేదా జియా మృతికి, విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల సంతాప తీర్మానం చేశాయి. కేంద్రం బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.
