Let's talk: editor@tmv.in
మొహమ్మద్ దీపక్ దేశభక్తి అపూర్వం: రాహుల్ గాంధీ

మొహమ్మద్ దీపక్ దేశభక్తి అపూర్వం: రాహుల్ గాంధీ

Pinjari Chand
26 ఫిబ్రవరి, 2026

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్‌కు చెందిన జిమ్ యజమాని దీపక్ కుమార్‌ను ‘మొహమ్మద్ దీపక్’గా ప్రశంసిస్తూ, ద్వేషానికి ఎదురొడ్డి బలహీనులను రక్షించడం కన్నా గొప్ప దేశభక్తి లేదన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన సామరస్యం–ప్రేమ భావజాలం కోట్లాది భారతీయుల హృదయాల్లో ఉంది. కానీ భయంతో జీవిస్తున్నారు. దీపక్ తన ధైర్యంతో వారికి దారి చూపించాడు. ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారు నిజానికి భయపడేవారే అని హిందీలో పేర్కొన్నారు. ఇటీవల దీపక్ కుమార్, అతని స్నేహితుడు విజయ్ రావత్‌లను 10 జనపథ్ లో కలిసిన వీడియోను గాంధీ పంచుకున్నారు. ఆ వీడియోలో, ఒక ముస్లిం దుకాణదారుడిని వేధిస్తున్న కార్యకర్తలకు తాను ఎలా ఎదుర్కోన్నాడో దీపక్ వివరించారు. ఘటన తర్వాత తన ఇంటి వద్ద గుంపు చేరినప్పుడు పరిస్థితి అదుపులో ఉండేందుకు పోలీసులు తనను స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు చెప్పారు. గాంధీ, దీపక్ భార్యతో కూడా మాట్లాడి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. త్వరలో కోట్‌ద్వార్‌కు వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు. మీరు త్రివర్ణ పతాకం, రాజ్యాంగాన్ని కాపాడారు. దీన్నికంటే గొప్ప దేశభక్తి లేదని గాంధీ అన్నారు.

జనవరి 26న కోట్‌ద్వార్‌లోని ‘బాబా’ దుస్తుల దుకాణం పేరును మార్చాలంటూ కొందరు నిరసనకు దిగగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ సమయంలో దీపక్ ‘మొహమ్మద్ దీపక్’గా తనను పరిచయం చేసుకుంటూ నిరసనకారులను వెనక్కు నెట్టిన ఘటన వైరల్ అయింది. అనంతరం జనవరి 31న మళ్లీ గుంపు చేరగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలపై మూడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ సంఘటన తర్వాత, రాహుల్ గాంధీ కుమార్‌కు మద్దతు ప్రకటించారు. సంఘ్ పరివార్ ఉద్దేశపూర్వకంగా భారతదేశాన్ని విభజించడానికి ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని విషపూరితం చేస్తోందని ఆరోపించారు.

ఈ వివాదం తర్వాత తన జిమ్ వ్యాపారం దెబ్బతిందని దీపక్ వెల్లడించారు. ఆయన జిమ్ లో తాను సభ్యత్వం తీసుకుంటానని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. కాగా, దీపక్‌ను భారత రాజ్యాంగం, మానవత్వం కోసం నిలబడిన హీరోగా గాంధీ అభివర్ణించారు.