Let's talk: editor@tmv.in
మొయినాబాద్ మున్సిపల్లో సంచ‌ల‌నం.. ఓటుకు రూ.70,000!

మొయినాబాద్ మున్సిపల్లో సంచ‌ల‌నం.. ఓటుకు రూ.70,000!

Gaddamidi Naveen
15 ఫిబ్రవరి, 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ, తెర వెనుక జరిగిన వికృత రాజకీయం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో ఒక ఓటు కోసం అభ్యర్థులు కుమ్మరించిన సొమ్ము చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎంతగా పతనమైందో అర్థమవుతోంది. ఇది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఏడాది ఖర్చు కాదు.. ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక్క ఓటు కోసం పెట్టిన వెల!.

అభ్యర్థి ప్రతి ఓటుకు భారీ మొత్తంలో రూ.70,000 నగదు, 25 కేజీలు బియ్యం, 15 లీటర్లు వంటనూనె, పట్టు చీర వంటి బహుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఓటుకు సుమారు రూ.70 వేల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అభ్యర్థి సుమారు 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడని సమాచారం. ఎన్నికల్లో ఓట్లు సంపాదించేందుకు ఆయన మొత్తం రూ.7 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితాలు వెలువడిన అనంతరం రాజకీయ పార్టీల మధ్య కొనుగోలు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విజయం అనంతరం ఆ అభ్యర్థిని కుటుంబ సభ్యులు, అనుచరులు “సురక్షిత ప్రదేశానికి” తరలించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే పోటీలో ఉన్న మరో ప్రధాన అభ్యర్థి కూడా ఒక్కో ఓటుకు సుమారు రూ.40 వేల వరకు ఖర్చు చేసినట్లు ఆరోపణలు రావడం గమనార్హం. మోయినాబాద్ ప్రాంతం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. వ్యవసాయ భూములు అధిక విలువ గల ఫామ్ హౌస్ ప్రాజెక్టులుగా మారడంతో ఈ ప్రాంతం రియల్టర్లకు ఆకర్షణీయంగా మారింది. దీంతో స్థానిక రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయాల్లో నిబద్ధత గల విద్యావంతులకు స్థానం లేకుండా పోతోందనేది ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఒకప్పుడు ఎంపీగా పోటీ చేయాలనుకున్న వారు కూడా ఇప్పుడు కనీసం మున్సిపల్ వార్డుకు పోటీ చేయాలంటే భయపడుతున్నారు. టికెట్ కోసం కోట్లు, ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేసే స్థితిలో సామాన్యులు లేరు అని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఎన్నికలు సిద్ధాంతాల పోరాటం కాకుండా అత్యధిక ధర పలికే వేలం పాటగా మారిపోయాయి. డబ్బున్న వాడిదే అధికారం అనే ధోరణి ప్రజాస్వామ్య మూలాలనే దెబ్బతీస్తోంది. ప్రజాస్వామ్య విలువలు నిలబడాలంటే ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, కఠిన నియంత్రణలు అవసరమని వారు సూచిస్తున్నారు.