మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సంచలనం: టీడీపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలకు పాజిటివ్
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌పై జరిగిన పోలీసు దాడి రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ పార్టీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలినట్లు అధికారులు తెలిపారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా, మొయినాబాద్‌లోని రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో శనివారం రాత్రి ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో రియల్టర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో పాటు ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో పార్టీలో ఉన్న ఒక వ్యక్తి తన వద్ద ఉన్న రివాల్వర్‌తో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేపింది.
పోలీసులు అక్కడున్న 11 మందికి ప్రాథమికంగా యూరిన్ డ్రగ్ టెస్టింగ్ కిట్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. మొదటి పరీక్షలో పైలట్ రోహిత్ రెడ్డి సహా ఐదుగురికి పాజిటివ్ రాగా, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు నెగటివ్ వచ్చింది. అనుమానంతో వీరిని ఆసుపత్రికి తరలించి రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షల అనంతరం ఎంపీ మహేష్ కుమార్‌కు కూడా డ్రగ్ పాజిటివ్ అని తేలిందని ఈగిల్ ఫోర్స్ ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు. దీంతో మొత్తం పాజిటివ్ తేలిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది.
పోలీసులు ఘటనా స్థలంలో 2 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అలాగే కాల్పులు జరిపిన ఆయుధాన్ని కూడా సీజ్ చేశారు. ఈ డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? పార్టీలోనే తీసుకున్నారా లేక బయట ఎక్కడైనా తీసుకుని ఇక్కడికి వచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈ దాడిని అత్యంత రహస్యంగా నిర్వహించింది. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిందితులు, కాల్పుల వ్యవహారం
చెవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఈ ఘటనపై మరిన్ని కీలక వివరాలు వెల్లడించారు.పోలీసులు రాగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ తుపాకీ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. ఆయుధానికి లైసెన్స్ ఉన్నప్పటికీ, వేరే వ్యక్తి కాల్పులు జరపడంపై కేసు నమోదు చేశారు.
పైలట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, రితేష్ రెడ్డి, నమిత్ మిశ్రా, ఎం. రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, రవి, అర్జున్ రెడ్డి ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు ప్రాథమిక పరీక్షల్లోనే పాజిటివ్ వచ్చింది.
ఇది ఇంకెన్నాళ్లు కొనసాగుతుంది? వీహెచ్
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పట్టుబడటంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇది ఇంకెన్నాళ్లు కొనసాగుతుంది? ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డ్రగ్స్ కేసులో ఎంపీ ప్రమేయం సిగ్గుచేటు: మంత్రి అజారుద్దీన్, వైఎస్ షర్మిల ధ్వజం
ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రమేయంపై రాజకీయ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తెలంగాణ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన మంత్రి అజారుద్దీన్, బహిరంగ జీవితంలో ఉన్నవారు సమాజానికి ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రచారం చేస్తారు, కానీ ఇలాంటి ఘటనలు సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతాయి. పట్టుబడిన వారు ఎవరైనా సరే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. పోలీసులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు అని ఆయన స్పష్టం చేశారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ ఘటనను "సిగ్గుచేటు"గా అభివర్ణించారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే, ఏలూరు ఎంపీ ఇక్కడ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం అత్యంత దారుణమని ఆమె విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కొకైన్ వంటి మాదకద్రవ్యాలను ఉపయోగిస్తూ పట్టుబడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
