Let's talk: editor@tmv.in
మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు.. పైలట్‌ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజ్‌ నోటీస్‌

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు.. పైలట్‌ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజ్‌ నోటీస్‌

Gaddamidi Naveen
18 మార్చి, 2026

డ్రగ్స్, ఆయుధాల కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై భారత్ రాష్ట్ర సమితి అధిష్టానం కఠిన చర్యలు చేపట్టింది. శనివారం మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌పై జరిగిన పోలీసు దాడిలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు నిర్ధారణ కావడంతో, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను ఆయనను పార్టీ కార్యక్రమాల నుంచి బహిష్కరిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఒక వారం లోపు పూర్తి వివరణను లిఖితపూర్వకంగా సమర్పించాలని పార్టీ ఆదేశించింది. తుది నిర్ణయం వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనరాదని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులో సరైన వివరణ ఇవ్వకపోతే, పార్టీ రాజ్యాంగం ప్రకారం తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ పరిణామాలకు కారణం మార్చి 14న తెలంగాణ పోలీసుల ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించిన అకస్మాత్తు దాడి. మోయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో జరిగిన పార్టీపై దాడి చేసినప్పుడు, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మ తుపాకీతో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిదని, అది లైసెన్స్ కలిగినదేనని, అయితే కాల్పులు నమిత్ శర్మే జరిపినట్లు వెల్లడించారు.

చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో పాల్గొన్న ఐదుగురు డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఘటన స్థలంలో రెండు గ్రాముల తెల్ల పొడి (డ్రగ్స్) స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారులు ఉన్నట్లు తెలిపారు.

ఈ ఘటనలో పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రితేష్ రెడ్డి, నమిత్ మిశ్రా, ఎం రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, రవి, అర్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. పార్టీ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించిన ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.