
మొబైల్ ఫ్లాష్‌లైట్ వెలుతురులో జార్ఖండ్‌లో ఆపరేషన్
జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్ వెలుతురులో మహిళకు ట్యూబెక్టమీ శస్త్రచికిత్స నిర్వహించిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. హజారీబాగ్ జిల్లా కేరెడారి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో ఈ ఘటన చోటుచేసుకుంది. 29 సెకన్ల వీడియోలో శస్త్రచికిత్స మధ్యలో లైట్లు ఆఫ్ కావడం, అనంతరం వైద్య సిబ్బంది మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ ఉపయోగిస్తూ ఆపరేషన్ కొనసాగించడం స్పష్టంగా కనిపిస్తోంది.
ట్యూబెక్టమీ అనేది మహిళల్లో శాశ్వతంగా గర్భనిరోధకానికి నిర్వహించే శస్త్రచికిత్స. డిసెంబర్ 13న ఈ ఆపరేషన్ జరగ్గా, డిసెంబర్ 18న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
హజారీబాగ్ సివిల్ సర్జన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ వీడియోను 45 ఏళ్ల వయసున్న ‘సహియా’ (గ్రామ స్థాయి ఆరోగ్య కార్యకర్త) చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన సమయంలో ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ, వ్యవస్థ మార్పిడికి కొంత సమయం పట్టిందని, ఆ సమయంలో ఫోన్ ఫ్లాష్‌లైట్ ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. వీడియో చిత్రీకరించి ప్రచారం చేసిన సహియాపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు సివిల్ సర్జన్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని జిల్లా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
