
మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహన సేవలను ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 'మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్' వాహన సేవలు అందుబాటులోకి వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక చొరవ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా ఈ అత్యాధునిక వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని, మెదక్ ప్రజలు ఈ ఉచిత సేవలను విరివిగా వినియోగించుకోవాలని కోరారు.
ఈ మొబైల్ వాహనం కేవలం ఒక వ్యాన్ మాత్రమే కాకుండా, ఒక మినీ ఆసుపత్రిని తలపించేలా ఉంటుంది. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించేందుకు అవసరమైన అన్ని రకాల స్క్రీనింగ్ పరికరాలు, సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉండటం విశేషం. ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా, నేరుగా ప్రజల వద్దకే ఈ పరీక్షా కేంద్రం రావడం గ్రామీణ ప్రాంత రోగులకు గొప్ప వరమని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక క్యాన్సర్ ఆసుపత్రి ఉండాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయ సాధనలో భాగంగా ఈ వాహనాన్ని ఒక ముందడుగుగా ఎంపీ అభివర్ణించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, లోక్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మొబైల్ వాహనం త్వరలోనే మెదక్ పార్లమెంట్ పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనుంది.
