Let's talk: editor@tmv.in
మొదటి దశ మెట్రోరైలు ప్రారంభం

మొదటి దశ మెట్రోరైలు ప్రారంభం

Pinjari Chand
7 అక్టోబర్, 2025

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బీహార్ లోని ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి పనులను శరవేగంగా ప్రారంభిస్తుంది. అలాగే పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. సోమవారం సీఎం నితీశ్​ కుమార్ పట్నా మెట్రో రైలు ప్రాజెక్టు కారిడార్ లోని 3.6 కి.మీల ఎలివేటెడ్​ స్ట్రెచ్​ మొదటి దశ పూర్తి కావడంతో సీఎం మెట్రో రైలును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సోమవారం నుంచే ప్రజలు ఇందులో బ్లూలైన్ లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ నుంచి భూత్ నాథ్ స్టేషన్​ వరకు ప్రయాణించవచ్చు. 2019లో ప్రధాని నరేంద్రమోడీ రూ.13,365 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులకు శంకుస్థాపన చేశారు.

సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు

ప్రజలను ట్రాఫిక్​ ఇబ్బందుల నుంచి తొలగించడానికి ఎన్డీయే ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్​ జైస్వాల్ తెలిపారు. దీని వల్ల అనేకమందికి ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. అలాగే మెట్రో ప్రారంభమైన ఈరోజును బంగారు అక్షరాలతో లిఖించుకోవాల్సిన రోజన్నారు. ఇప్పటి వరకు మనం మెట్రో రైలును చూడడానికి కొల్​ కత్తా, ఢిల్లీకి వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు పట్నాలోనే ప్రయాణించవచ్చన్నారు. ఇది ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన బహుమతి అని ప్రశంసించారు. అలాగే పర్యావరణానికి ప్రయోజనం ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలను ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి గురించి ప్రతిపక్షాలు మాట్లాడటం లేదన్నారు. అలాగే జేడీయూ నాయకుడు రంజన్ ప్రసాద్ మాట్లాడుతూ సీఎం నితీశ్ పట్నా ప్రజల దీర్ఘకాల నిరీక్షణకు ముగింపు పలికారని, ఆయన నాయకత్వంలో అనేక పెద్ద, పెద్ద నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తున్నారన్నారు. పట్నా ప్రజల కలను సాకారం చేశారని ప్రశంసించారు.