
మొజ్తబా ఖమేనీకి నో లైఫ్ గ్యారెంటీ: నెతన్యాహు హెచ్చరిక
ఇరాన్ అగ్రనేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలనిస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి ఎటువంటి ప్రాణ రక్షణ లేదని, ఉగ్రవాద సంస్థలను నడిపే ఎవరికీ తాము గ్యారెంటీ ఇవ్వబోమని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికే తమ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక అణు శాస్త్రవేత్తలు హతమయ్యారని వెల్లడించిన ఆయన, కొత్త నేత మొజ్తబా కేవలం సైన్యం చేతిలో కీలుబొమ్మ అని, ఆయన కనీసం బయట కూడా తిరగలేరని ఎద్దేవా చేశారు.
ఆపరేషన్ 'రోరింగ్ లయన్'
గత నెల ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా పగ్గాలు చేపట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ 'రోరింగ్ లయన్' పేరుతో, అమెరికా 'ఎపిక్ ఫ్యూరీ' పేరుతో ఇరాన్ అణు ఆశయాలను తుంచివేయడం, క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేయడం కోసం దాడులను ఉధృతం చేశాయి. ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులపై అలుపెరగని పోరాటం సాగిస్తూ కోలుకోలేని దెబ్బ తీస్తున్నామని నెతన్యాహు వివరించారు.
పాలన మార్పు దిశగా.. ఇరాన్ ప్రజలకు పిలుపు
ఇరాన్‌లోని నిరంకుశ పాలనను అంతమొందించేందుకు తాము అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు. "మేము ఇరాన్ వీధుల్లోనూ, చెక్‌పోస్టుల వద్ద ఐఆర్‌జీసీ, బాసిజ్ బలగాలపై విరుచుకుపడుతున్నాం. ప్రజలు విముక్తి పొందే సమయం ఆసన్నమైంది. మేము మీకు సహకరిస్తాం కానీ, చివరికి మార్పు అనేది మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని నీటి దాకా తీసుకెళ్లగలం కానీ, నీళ్లు తాగించలేం" అని ఇరాన్ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలోకి సైన్యాన్ని పంపకుండా కేవలం వైమానిక దాడుల ద్వారానే అక్కడి వ్యవస్థలను మార్చగలమని ఆయన సంకేతాలిచ్చారు.
ట్రంప్‌తో మైత్రి.. సరికొత్త ప్రాంతీయ పొత్తులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న సంబంధం గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు-ఇజ్రాయెల్ ప్రధాని మధ్య లేనంత బలంగా ఉందని నెతన్యాహు కొనియాడారు. "మేము దాదాపు ప్రతిరోజూ మాట్లాడుకుంటాం. భవిష్యత్తు తరాల కోసమే కాకుండా మానవాళి భవిష్యత్తు కోసం కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం" అని తెలిపారు. అలాగే ఈ యుద్ధం వల్ల మధ్యప్రాచ్య పటం మారిపోతోందని, కొన్ని వారాల క్రితం వరకు ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాంతంలోని మరికొన్ని దేశాలతో సరికొత్త దౌత్యపరమైన పొత్తులు కుదుర్చుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
