Let's talk: editor@tmv.in
మొక్క‌లు త‌ల్లితో స‌మానం: మంత్రి స‌త్య‌కుమార్

మొక్క‌లు త‌ల్లితో స‌మానం: మంత్రి స‌త్య‌కుమార్

FL - BRTH
29 సెప్టెంబర్, 2025

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌ల్లి పేరుతో మొక్క‌ను నాటి వాటిని ప‌రిర‌క్షించి స‌మాజానికి మేలు చేకూర్చ‌వ‌చ్చ‌ని ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపు మేర‌కు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ‘న‌మో వ‌నం-ఏక్ పెడ్ మాకే నామ్’ కార్య‌క్ర‌మంలో భాగంగా అనంత‌పురం న‌గ‌రంలోని చిరంజీవి రెడ్డి క‌ళాశాల ప్రాంగ‌ణంలో మంత్రి స‌త్య‌కుమార్ పాల్గొన్నారు. క‌ళాశాల ప్రాంగ‌ణంలో మొక్క‌ల‌ను నాటారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్య‌క్ర‌మాలు హ‌రిత వాతావ‌ర‌ణాన్ని భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించ‌డ‌మే కాకుండా, త‌ల్లి స్మ‌ర‌ణ‌ను సజీవంగా ఉంచుతాయ‌ని అన్నారు. బీజేపీ కేవ‌లం రాజ‌కీయ కార్య‌క‌లాపాలు, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే కాకుండా సామాజిక కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొనాల‌ని విశ్వ‌సించే పార్టీ అని తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మొక్క‌ల పెంప‌కం ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌ధాని నరేంద్ర మోదీ అనేక‌సార్లు ప్ర‌స్తావించిన విష‌యాన్ని మంత్రి స‌త్య‌కుమార్ గుర్తు చేశారు. అందుకే దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ ఒక మొక్క నాటాల‌ని మోదీ పిలుపునిచ్చిన‌ట్టు మంత్రి తెలిపారు.

సెప్టెంబ‌ర్ 17న మోదీ జ‌న్మ‌దినం నుంచి అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి వ‌ర‌కు ప‌దిహేను రోజుల పాటు దేశ‌వ్యాప్తంగా ర‌క్త‌దాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, చెట్ల పెంప‌కం వంటి సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి స‌త్య కుమార్ చెప్పారు. చెట్లు ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యానికి, జీవవైవిధ్య ర‌క్ష‌ణ‌కు ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిన విష‌య‌మేన‌ని అన్నారు. ఒక చెట్టు త‌న జీవిత కాలంలో ఆక్సిజ‌న్ ను వాతావార‌ణానికి అందించ‌డ‌మే కాకుండా, కార్చ‌న్ డైయాక్సైడ్ ను పీల్చుకుని ప్ర‌జల ఆరోగ్యాల‌ను కాపాడుతుంద‌ని తెలిపారు.

చెట్లు త‌ల్లిలా చివ‌రి వ‌ర‌కు మ‌న‌ల్ని కాపాడుతుంద‌ని, పండ్ల‌ను, నీడ‌ను అందిస్తూ ప‌క్షుల‌కు ఆవాసంగా నిలుస్తున్నాయ‌ని గుర్తు చేశారు. అలాంటి చెట్ల‌ను ప‌విత్రంగా భావించి, మొక్క‌లు నాటి వాటిని ప‌రిర‌క్షించి వాతావర‌ణ స‌మ‌తుల్యాన్ని, జీవ‌వైవిధ్యాన్ని కాపాడ‌టం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అంటూ ఏపీ వైద్యారోగ్య‌శాఖా మంత్రి స‌త్య‌కుమార్ అన్నారు.

మొక్క‌లు త‌ల్లితో స‌మానం: మంత్రి స‌త్య‌కుమార్ - Tholi Paluku