Let's talk: editor@tmv.in
మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి: కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ

మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి: కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ

Panthagani Anusha
29 మార్చి, 2026

రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వారిని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మార్కెట్‌లో ధరల పతనం నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ‘ధర లోటు చెల్లింపు పథకాన్ని’ రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన శుక్రవారం లేఖ రాశారు. నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

రికార్డు దిగుబడి.. పడిపోతున్న ధరలు

రాష్ట్రంలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు ఆశించిన దానికంటే గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో సుమారు 4.83 లక్షల హెక్టార్లలో (దాదాపు 5 లక్షల ఎకరాలు) పంట సాగవుతోందని దీని ద్వారా దాదాపు 38 లక్షల టన్నుల వరకు రికార్డు స్థాయి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఉత్పత్తి పెరగడంతో మార్కెట్‌లో ధరలు కనీస మద్దతు ధర కంటే దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాల్ మొక్కజొన్నకు మద్దతు ధర రూ. 2,400 ఉండగా బహిరంగ మార్కెట్‌లో కేవలం రూ.1,500 నుంచి రూ. 1,700 మాత్రమే లభిస్తోందని దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని వివరించారు.

నష్టాన్ని 100 శాతం కేంద్రమే భరించాలి

మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ‘ధర లోటు చెల్లింపు పథకాన్ని’ వర్తింపజేయాలని చంద్రబాబు కోరారు. సాధారణంగా ఈ పథకం కింద ఉన్న 25 శాతం సాగు పరిమితిని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 100 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసానికి రైతులకు పరిహారం చెల్లించాలని ఆ నష్టాన్ని పూర్తిగా (100 శాతం) కేంద్ర ప్రభుత్వమే భరించాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఈ ప్రత్యేక రాయితీలు కార్యక్రమాన్ని 2026 జూన్ వరకు కొనసాగించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి నివేదికపై తక్షణ స్పందన

రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. క్షేత్రస్థాయిలో ధరలు, రైతులు తమ పంటను నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రానున్న రోజుల్లో కోతలు పూర్తయి ధాన్యం భారీగా మార్కెట్‌కు వస్తే ధరలు మరింత పతనం కావచ్చని మంత్రి నివేదించారు. దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి, రైతు ప్రయోజనాలే పరమావధిగా కేంద్రానికి ఈ లేఖ రాశారు.