
మొంథా.. వణికించేంత
సముద్రం గర్జిస్తోంది. పెనుగాలులు విరుచుకుపడుతున్నాయి.. ఆకాశం తన ప్రకోపాన్ని వర్షంగా కురిపిస్తోంది. ఆంధ్రాలో ప్రతి ఊరు, ప్రతి చెట్టు, ప్రతి ఇల్లు ఇప్పుడు ఆ భయానక “మెంథా తుఫాను” దాటికి అల్లాడుతున్నాయి. రైతు చేతుల్లోని పంటలు వరదల పాలయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. తీర ప్రాంతాలలో వాయు వేగానికి విద్యుత్ స్తంభాలు విరిగి పడుతున్నాయి. పిల్లలు భయంతో తల్లుల ఒడిలో దాక్కుంటున్నారు, వృద్ధులు ఆకాశం వైపు చూసి ప్రార్థిస్తున్నారు. “ఇంకా ఎంత పరీక్షించతావు దేవుడా ?” అని. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఈ నేల తిరిగి లేస్తుంది, పూల్లా విరుస్తుంది. చెప్పాలంటే “మెంథా” తుఫాను కేవలం గాలులు కాదు, అది మన జీవన పోరాటానికి మరో సవాలు.ఈ సవాలును ఎదుర్కోవడానికి ఆంధ్ర ప్రభుత్వం అధికారులను సిద్ధం చేసింది. సహాయకచర్యలు తీవ్రతరం చేసింది. మంత్రులు ప్రజలకు అందుబాటులో వుంటూ నిరంతర సమీక్షలు చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు సమీక్ష
మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్ష ప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఆర్టీజీఎస్ నుంచి మొంథా తుపాను ప్రభావంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి సమీక్షించారు. గతంలో వచ్చిన తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం మొంథా తుఫాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంగా వస్తోందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా చేరుకుని తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాలకు మరిన్ని రెస్క్యూ బృందాలను, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశించారు. గాలులు, వర్ష తీవ్రతను అంచనా వేస్తూ అందుకు తగినట్టుగా యంత్రసామాగ్రిని, సమాచార పరికరాలను అత్యవసర యంత్రాలను, బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి ఎంత ప్రాంతం నీట మునిగింది...? ఏయే వాగులు పొంగే ప్రమాదం ఉందో అంచనా వేసి లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గ్రామ వార్డు సచివాలయాల నుంచి క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకోవాలన్నారు. గతంలో హుద్ హుద్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి ప్రజలను నాలుగు రోజుల్లో తిరిగి బయటకు తెచ్చామని సీఎం గుర్తు చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం నుంచి భారీ వర్షాలు నమోదైనందున ఆ ప్రాంతంలోని ఎర్రకాలువకు ఎగువ నుంచి ఆకస్మాత్తుగా ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయటంతో పాటు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం పునరుద్ధణ చర్యలు
గడచిన 24 గంటల్లో విశాఖ, కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. మొంథా తుపాను ప్రభావం కారణంగా వర్ష ప్రభావిత జిల్లాల్లోని 1.92 కోట్ల మందికి భారీ వర్ష సూచనలకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ ఫోన్లకు పంపామని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా 2,703 జనరేటర్లను కూడా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని సీఎంకు తెలిపారు. సచివాలయాల వారీగా నిత్యావసర వస్తువులను కూడా సిద్ధం చేసుకున్నట్టు వివరించారు. అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ కోసం పోలీసు విభాగం 81 టవర్లతో వైర్ లెస్ సిస్టంను ఏర్పాటు చేశామన్నారు. జేసీబీలు, యంత్ర పరికరాలను కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం పశువులకు కావాల్సిన గ్రాసం కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాన్ని, చెట్లు, టవర్లు, హోర్డింగ్ లు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావంతో ఇప్పటి వరకూ 43 వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు తెలిపారు. కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పంట నీటమునిగిందని సీఎంకు వివరించారు. అయితే పంట నష్టం వివరాలను రైతులు కూడా పంపేలా వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ లో మార్పు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తుఫాను కారణంగా రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్ల ధ్వంసం వంటివి జరిగితే ఊళ్ల మధ్య రాకపోకలకు ఇబ్బంది అవుతుందని, అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్ర స్థాయి యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, అందరూ ఫీల్డులో ఉన్నారని మంత్రి నారా లోకేష్ సీఎంకు వివరించారు. ప్రస్తుతం రాయలసీమలో వర్షాలు లేనందున ఎగువ నుంచి వచ్చే కృష్ణా ప్రవాహాలను అక్కడి చెరువులు నింపే ప్రక్రియను చేపట్టాలని సీఎం జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒక్క టీఎంసీ నీటిని కూడా కోల్పోకుండా నీటిని నింపే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షకు మంత్రులు అనిత, నారాయణ, అనగాని సత్యప్రసాద్, సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
స్పందించిన ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 200 కిమీ, విశాఖపట్నంకి 290 కిమీ దూరంలో కేంద్రీకృతం అయ్యిందని, ఈరోజు రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.ఈ తుఫాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం ఉంటుందని, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉంటాయని, తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని,ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం డి ప్రఖర్ జైన్ వెల్లడించారు. అత్యవసర సహాయ నంబర్లు 112, 1070, 1800 425 0101 అందుబాటులో వుంటాయని 24×7 సేవలు అందుతాయని ప్రకటించారు.
తుఫాను ప్రభావంపై హోం మంత్రి అనిత టెలి కాన్ఫరెన్స్
పాయకరావుపేట నియోజకవర్గ అధికారులు,ముఖ్య నాయకులతో హోం మంత్రి అనిత టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు అధికారులను అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచినలు చేసారు. మత్స్యకార గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి. పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయం ఏర్పాటు చేయండి. భోజనాలు,త్రాగునీటీలో శుభ్రత పాటించండి. ఎఫెక్ట్ ఉన్న గ్రామాల్లో సహాయక చర్యల్లో నాయకులు పాల్గొనండి. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. బంగారమ్మపాలెం, సోమిదేవుపల్లి, రాజయ్యపేట గ్రామాల్లో ఉన్న చిన్న,చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను హోం మంత్రి ఆదేశించారు.
తుపాను ప్రభావిత జిల్లాల్లో మంత్రుల పర్యటనలు ,అత్యవసర చర్యలు
నర్సాపురం లో ప.గో జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి
నర్సాపురం లో ప.గో జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నాగిడిపాలెం, పాతపాడు, కాళీపట్నం పునరావాస కేంద్రాలను పరిశీలించి, తుపాను ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించిచారు. తుపానుతో అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతీ పునరావాస కేంద్రంలో వైద్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలి. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు మంచి తాగునీరు, భోజనం ఏర్పాటు చేయాలి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు, అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. విపత్తు సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.
మచిలీపట్నం మండలంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మొంథా తుఫాను వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మంత్రి మచిలీపట్నం మండలంలోని సుల్తానగరం గోల్డ్ కన్వెన్షన్ హాల్, 50 వ డివిజన్లోని నారాయణపురంలోనీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ మోటార్లతో మురికి కాలువలోని నీటిని పక్కనున్న చెరువులోకి తోడే కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.
అనంతరం 50 వ డివిజన్ నారాయణపురంలోనీ వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నీ అక్కడే పై భవనం లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. మంత్రి డివిజన్లోని వీధులన్నీ కాలినడకన వర్షపు నీటిలోనే తిరిగి అక్కడి ప్రజలతో మమేకమై వారు ఎలా ఉన్నారంటూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో మురికి కాలువలు వర్షపు నీటితో నిండిపోయి పొంగి రోడ్డుపైనా నిలిచిపోవడం మంత్రి గమనించారు.అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం నగరంలోని 40, 42, 50 డివిజన్లో, శివగంగ ప్రాంతంలో వర్షపు నీరు నిలిచి ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. వర్షపు నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేసి బయటకు దూరంగా మళ్ళిస్తున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మచిలీపట్నం నియోజకవర్గంలో 18 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో దక్షిణంలో 11, ఉత్తరంలో 7 సురక్షిత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంకా అవసరమైతే అదనంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
మంత్రి కొలుసు పార్థసారథి.*
మంత్రి కొలుసు పార్థసారథి మోంథా తుఫాను భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలైన ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి గ్రామాలలో గండ్లు పడిన చెరువులను పరిశీలించి ప్రజలకు భరోసా కల్పిస్తూ తక్షణ చర్యలు అందించాడానికి అధికారులు అందుబాటులో వుండాలని ఆదేశించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి వి విజయ రామరాజు
మొంథా తుఫాన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిసర తీర ప్రాంతాలలో మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు జిల్లా మొంథా తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి వి విజయ రామరాజు వెల్లడించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి వారు గ్రామ సచి వాలయ స్థాయి వరకు వీడియో కాన్ఫరె న్స్ నిర్వ హించి మొంథా తుఫా న్ ను సమర్థవంతంగా ఎదుర్కొ నేందుకు సన్నద్ధత సహాయక చర్యల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధి లో ఉన్న కచ్చా గృహాలు పక్కా గృహాలలో నివసిస్తున్న వారిని మధ్యాహ్నం రెండు గంటల లోపుగా పోలీస్ సిబ్బంది సహకారంతో బై ఫోర్సు ను వినియోగించి తప్పనిసరిగా మ్యాపింగ్ చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ప్రాణ ఆస్తి నష్టాలను పూర్తిగా నివారించాలన్నారు ప్రతి పునరావాస కేంద్రానికి కేటాయించిన ఇన్చార్జి అధికారి నాణ్యమైన ఆహారం, అన్ని రకాల ఔషధాలతో మెడికల్ క్యాంపులు సురక్షితమైన త్రాగునీరు వంటి కనీస వసతులు కల్పన ద్వారా తాత్కాలికంగా ఆశ్రయం పొందేలా చర్యలు చేపట్టాలన్నారు.
మొంథా తుఫాన్ ముప్పు కోనసీమ జిల్లాకు ఉన్నందున తీరప్రాంత ప్రజలను తక్షణం పునరావాస కేంద్రాలకు పోలీసుల సహకారంతో తప్పనిసరిగా తరలించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో క్షేత్రస్థాయి అధికా రులు తీర ప్రాంతవాసు లను అప్రమత్తం చేస్తూ సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తర లిస్తూ నాణ్యమైన ఆహారాన్ని ఆరోగ్య భద్రత ను కల్పించాలన్నారు తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా ఆహారం తాగునీరు కలుషితం కాకుండా హైజిన్ వంటి అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగిందని ఎక్కడా ఎటు వంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాం గమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుఫాన్ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలన్నారు. తుఫాను తీరాన్ని దాటే ప్రాంతంలో సుమారుగా గంట సమయం పాటు తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. తుఫాన్ అనంతరం ముందుగా రోడ్డు కనెక్టివిటీ కొరకు చెట్లు స్తంభాలు తొలగించాలని పవర్ కనెక్టివిటీ నీ విద్యుత్ స్తంభాలను ట్రాన్స్ఫా ర్మర్ల కండక్టర్లు ఏర్పాటు ద్వారా పునరుద్ధరణ కై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ తీర ప్రాంతంలో జి ప్లస్ వన్ గృహాలలో ఉన్న వారి తప్ప మిగిలిన సముద్ర తీరానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న కచ్చా పక్కా గృహాలలోని వారు తప్పని సరిగా పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందాలన్నారు. కాట్రేనికోన ఐ పోలవరం సఖినేటిపల్లి మల్కిపురం, ఉప్పలగుప్తం కొత్తపేట మండలాలు సుమారుగా 7 వేల మందినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు ఈ తరలింపు ప్రక్రియను అధికారులు మధ్యాహ్నం 2 గంటల్లోపు పూర్తి చేయాలన్నారు శిథిలావస్థకు చేరిన వసతి గృహాలలో విద్యార్థినీ విద్యా ర్థులు నివాసం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ముంపు బాధితుల తరలింపులో ఎటువంటి అలసత్వాన్ని వహించరాదని ఆయన పునరుద్ఘాటించారు. మొంథా తుఫాన్ రిస్క్యూ ఆపరేషన్స్ పునరావాసం వంట అంశాలలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు జిల్లా యంత్రాంగం నిర్దిష్ట ఆదేశాలను అందరూ తూ చా తప్పకుండా ఆచరించి మొంథా తుఫాన్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనాలని ఆదేశించారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో పూర్తిగా విద్యుత్ సరఫరా ను నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు. తుఫాన్ తీరాన్ని దాటిన సమయంలో తీర ప్రాంత వాసులు ఎవరు ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్ళ రాదని సురక్షితంగా ఇంటిలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయాన్ని క్షేత్రస్థాయి అధికారులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో అందరూ సంయమనం పాటించి రాబోయే 48 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను దృష్ట్యా మార్కెట్లో నిత్యవసర వస్తువులు ధరలు అదుపులో ఉంచాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు తుఫాన్ ప్రమాదం ముగిసే వరకు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిం చాలని ఆదేశించారు. సహాయక కేంద్రాలలో భోజన, వసతి సదుపా యాలు సక్రమంగా ఉండాలన్నారు ప్రభావిత ప్రాంతాల్లో నిత్య వసర వస్తువులు విల్వలు తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమాచార వ్యవస్థ సేవలలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. వివిధ శాఖల సమస్వయం తో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తీర ప్రాంత ప్రజల తరలింపు ఆపరేషన్, పునరావాసం, ఆస్తి ప్రాణ నష్టాలు, రహదారులు పునరుద్ధరణ విద్యుత్ పునరుద్ధరణ వంటి చర్యల ద్వారా మొంథా తుఫాన్ ముప్పును ఎదుర్కొనాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులతోపాటుగా సుమారు 150 గ్రామ సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులతో తీర ప్రాంత గస్తీ ని నిర్వహించి సముద్ర తీరంలో ఎవరు సంచరించకుండా చర్యలు చేపడతారన్నారు.
1906 తాత్కాలిక షెల్టర్ల ఏర్పాటు - లోకేష్
ఐటి మంత్రి లోకేష్ స్పందిస్తూ తుపాను ప్రభావం, ముంపు తీవ్రత అధికంగా ఉండే 1,328 గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 3,465 గర్భిణీలను తరలించి, వారికి కావాల్సిన పౌష్టికాహారం, నిత్యావసరాలను అందజేస్తున్నాం. 1,906 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటుచేసి పునరావాసానికి అవసరమైన సామగ్రి అంతా పంపించాం. శానిటేషన్ కు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, లైమ్, ఇతర సామగ్రిని ఆయా గ్రామాలకు చేరవేశాం అన్నారు.
ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
14,798 పాఠశాలలకు సెలవులు ప్రకటించాం, 364 స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చాం. ఈ నెల 29వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసి, నిషేదాజ్ఞలు విధించాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం 11 ఎన్ డీఆర్ఎఫ్, 12 ఎస్ డీఆర్ ఎఫ్ టీమ్ లు, రిజర్వ్ టీమ్ లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే రావడానికి ఆర్మీ కూడా హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్నారు. 145 ఉడ్ కటింగ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే విశాఖపట్నం, తదితర ప్రాంతాల్లో చెట్లు పడిపోయిన చోట వారు సేవలందిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించి 325 శిబిరాలు సిద్ధం చేశాం, 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి.అన్నారు లోకేష్.
సహాయ చర్యలపై ముందస్తు ఏర్పాట్లు
తుపాను తీరం దాటిన తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలు చాలా కీలకం. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి 11,347 స్తంభాలు, 1210 ట్రాన్స్ ఫార్మర్లు రెడీ చేశాం. సైక్లోన్ డైరెక్షన్ ను బట్టి సేవలందించేందుకు 772 రిస్టోరేషన్ టీమ్స్ ను కూడా సిద్ధంగా ఉంచాం. హాస్పటల్స్ కు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎక్కడైన రోడ్లు కోతకు గురైతే వెంటనే పునరుద్ధరించి, ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 7,289 జేసీబీ, క్రేన్స్, వాహనాలు సిద్ధంగా ఉంచాం. తాగునీటికి సంబంధించి వాటర్ ట్యాంకర్లను రెడీ చేశాం. తుపాను సమయంలో ప్రధానంగా ప్రభావితమయ్యేది సీపీ డబ్ల్యూ స్కీమ్స్. తిత్లీ అనుభవాలతో ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో పక్కాగా చర్యలు చేపట్టి 1,037 డీజిల్ జనరేటర్లను ఆయా ప్రాంతాలకు పంపించాం. ఎయిర్ టెల్, జియో, ఇతర సర్వీసు ప్రొవైడర్లు సెల్ ఫోన్ టవర్లకు అవసరమైన డీజి సెట్లు సిద్ధం చేశారు, డీజిల్ కూడా అందుబాటులో ఉంచాం.
రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నాం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం కలెక్టర్లందరికీ నిధులు విడుదల చేశాం. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆర్టీజీఎస్ లో రాత్రంతా బసచేసి రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తాం. ప్రతికాల్వలు, చెరువులు రోడ్లకు ఎక్కడైనా కోతలు, గండ్లు పడ్డాయా అనే అంశంపై రాత్రిపూట కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని చెప్పిన ముఖ్యమంత్రి. క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయడంతోపాటు, టెక్నాలజీని వినియోగించుకుని పంట నష్టాన్ని అంచనా వేయాలని సీఎం సూచించారు. శాఖల వారీగా నష్టం అంచనా నివేదికలను సిద్దం చేసుకోవాలని చెప్పారు. నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాను కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు. ఈ తుఫాను అంతర్వేది,పాలెం దగ్గర తీరం దాటుతుందని,డానిప్రబావంతో వీచే గాలులకు చాలా జిల్లాల్లో కరెంటు లేక ప్రజలు చీకటిలో మగ్గుతున్నారని తుఫాను ప్రభావం తగ్గగానే యుద్ద ప్రాతిపదికన విద్యుత్తును పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు.
