Let's talk: editor@tmv.in
మొంథా తుఫాన్ కారణంగా అప్రమత్తమైన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే శాఖ

మొంథా తుఫాన్ కారణంగా అప్రమత్తమైన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే శాఖ

Dantu Vijaya Lakshmi Prasanna
28 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ వణికిస్తుంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమక్రమంగా బలపడి మొంతా తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఈ తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత దృష్ట్యా విశాఖ మీదుగా నడిచే 43 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు అక్టోబరు 26 న ఒక ప్రకటన విడుదల చేసింది. రైల్వే శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం, అక్టోబర్‌ 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్ల సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. సైక్లోన్ "మొంథా" కారణంగా రద్దు చేయబడిన కొన్ని కోచింగ్ రైళ్లు అక్టోబర్ 27 నుండి తిరిగి ప్రారంభించబడ్డాయి, అని తాజాగా మళ్ళీ ఒక ప్రకటన విడుదల చేసింది..

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటూ రద్దు చేసిన రైల్వే సర్వీసుల జాబితాను రైల్వే శాఖ విడుదల చేసింది. దానితో పాటు ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ట్రైన్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని సూచించింది. తుఫాను తీవ్రతను బట్టి తరువాత మిగిలిన సర్వీసులను పునరుద్దరిస్తామని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను క్రమంగా బలపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది. ఈ మొంథా తుపాను ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.

మొంథా తుఫాన్ కారణంగా అప్రమత్తమైన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే శాఖ - Tholi Paluku