Let's talk: editor@tmv.in
మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించనున్న కేంద్ర బృందం

మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించనున్న కేంద్ర బృందం

Panthagani Anusha
10 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాల్లో మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఎడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం (ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం) సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

కేంద్ర బృందంలో వ్యవసాయం, జలవనరులు, రహదారులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి వంటి పలు కీలక మంత్రిత్వ శాఖల అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. మంథా తుఫాను కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం, మౌలిక సదుపాయాల విధ్వంసం, పలు కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో, ఈ కేంద్ర బృందం పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండు రోజుల పర్యటనలో భాగంగా బృందం రెండు టీములుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. సోమవారం నాడు టీమ్-1 బాపట్ల జిల్లాలో పర్యటించగా, టీమ్-2 కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తుంది. మంగళవారం నాడు, ఈ బృందాలు ప్రకాశం, కోనసీమ జిల్లాల్లో నష్టం అంచనాలను పరిశీలిస్తాయి. అదేవిధంగా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులతో నేరుగా మాట్లాడి, వ్యవసాయ, గృహ, మౌలిక సదుపాయాల నష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం జిల్లా పరిపాలనల అధికారులు వివరణాత్మక నష్ట నివేదికను కేంద్ర బృందానికి సమర్పించనున్నారు.

కేంద్ర బృందం తమ క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తయిన తర్వాత తుఫాన్ ప్రభావంపై సమగ్ర నివేదికను తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే, రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ సహాయం కోసం తమ మెమొరాండంను (జ్ఞాపిక) ఖరారు చేస్తుంది. కేంద్రం నుంచి ఆర్థిక సహాయం మంజూరు కావడం ద్వారా రాష్ట్రంలో సహాయక చర్యలు, పునరావాసం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు వేగవంతం అవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భావిస్తోంది.