
'మొంథా' తుఫాను ప్రభావం – ఆర్ అండ్ బి శాఖకు హై అలర్ట్ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంపై “మొంథా” తుఫాను ప్రభావం కొనసాగుతుండటంతో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్ అండ్ బి శాఖ అధికారులు హై అలర్ట్‌లో ఉండాలని సూచనలు జారీ చేయబడ్డాయి.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులు ఈఎన్సీలు, సీఎస్‌లు, ఎస్‌ఈలతో సమీక్ష సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి అధికారి ఫీల్డ్ లెవెల్‌లో పరిస్థితిని క్లోజ్ మానిటరింగ్ చేయాలని, అత్యవసర పరిస్థితులు తప్పించి ఎవరూ సెలవులకు వెళ్లరాదని స్పష్టం చేశారు.
వర్షాల కారణంగా ప్రమాద పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న లోకాజ్‌వేలు, కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అలాగే, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమన్వయం కల్పించి సమగ్ర చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
హైదరాబాద్‌లోని ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, అన్ని జిల్లాలతో నిరంతర అనుసంధానం కొనసాగిస్తున్నారు అని పేర్కొన్నారు. ప్రజా రవాణా అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
“మాన్సూన్ సమయంలో మా ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో చేసిన మేల్కొలుపు చర్యలు అభినందనీయం. అదే కృషి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కూడా కొనసాగించాలి” అని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలందరూ అత్యవసరం అయితేనే రోడ్లపైకి రావాలని, స్థానిక అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
