Let's talk: editor@tmv.in
మొంథా తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ సమీక్ష

మొంథా తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ సమీక్ష

Gaddamidi Naveen
30 అక్టోబర్, 2025

'మొంథా' తుఫాను ప్రభావం రాష్ట్రంలో నెలకొన్న వర్షాల పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు.వరి కోతల సమయం కావడం, పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసి ఉండడంతో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా, ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలలోనూ వర్షాల నుంచి రక్షణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

జిల్లాల్లో హై అలర్ట్, రైల్వే ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, తుఫాను ప్రభావం అధికంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయ‌న సూచించారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో, రైల్వే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సహాయక చర్యలు, భద్రతపై మార్గదర్శకాలు

తుఫాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలలో ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా కలెక్టర్లు ఈ బృందాలకు సరైన మార్గదర్శకత్వం వహించాలని సూచించారు.

జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి, వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల కుటుంబాలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ఆయ‌న‌ చెప్పారు.నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలన్నారు.రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, పోలీస్, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.

ఆరోగ్యం, పారిశుద్ధ్యం

తుఫాను ప్రభావంతో నీరు నిలిచిపోయి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించే అవకాశం ఉన్నందున, నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశునష్టం చోటుచేసుకోకుండా అన్ని శాఖలు అత్యంత జాగ్రత్తలు వహించాలని ఆదేశిస్తూ, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జిహెచ్‌ఎంసీ, హెచ్‌వైడీఆర్‌ఏ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

మొంథా తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ సమీక్ష - Tholi Paluku