Let's talk: editor@tmv.in
మొంథా తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలో 230 కి.మీ మేర దెబ్బతిన్న రోడ్లు

మొంథా తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలో 230 కి.మీ మేర దెబ్బతిన్న రోడ్లు

Shaik Mohammad Shaffee
31 అక్టోబర్, 2025

మొంథా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 230 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, మొంథా తుఫాన్ ప్రభావంతో ఆర్‌అండ్‌బి రోడ్లలో 334 లొకేషన్లలో 230 కిలోమీటర్ల మేర నష్టం జరిగిందని తెలిపారు.

ముందస్తుగానే ఈఎన్సీలు, సిఈలు, ఫీల్డ్ ఇంజినీర్లను అప్రమత్తం చేయడం వలన ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీల తాత్కాలిక మరమ్మతులకు సుమారు రూ.7 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.225 కోట్ల అంచనాలు సిద్ధం చేశామని తెలిపారు. అకాల వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని, తడిసిన ధాన్యాన్ని సేకరించి వెంటనే మిల్లులకు తరలించేలా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పత్తి తేమ శాతం విషయంలో రైతులకు సడలింపులు ఇవ్వాలని సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తాని ముంబైలో కలిసి విజ్ఞప్తి చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు.

నల్గొండ జిల్లాకే అత్యధిక నష్టం: మంత్రి కోమటిరెడ్డి

మొంథా తుఫాను కారణంగా నల్గొండ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితం అయ్యిందని, వేలాది ఎకరాల వరి, పత్తి పంటలు తుఫాను వల్ల నాశనమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఐకేపీ కేంద్రాలలో సుమారు 2 లక్షల టన్నుల వరి ధాన్యం నిల్వ ఉందని ఆయన వెల్లడించారు. సేకరించిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేలా.. మిల్లర్లు వెంటనే ఆ ధాన్యాన్ని తీసుకునేలా చూడాలని సీఎం రేవంత్‌ను మంత్రి కోమటిరెడ్డి కోరారు.