
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా వరదల తీవ్రతను అంచనా వేయడానికి ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి అనంతరం హనుమకొండ చేరుకున్నారు.
అక్కడి నుంచి సమ్మయ్య నగర్, కాపువాడ, పోతననగర్ తదితర ప్రాంతాలను సందర్శించి, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారి ఆవేదనలను విన్న సీఎం ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందిస్తామని, రాష్ట్రంలో సుమారుగా 4.47 లక్షల ఎకరాల పొలాలు నీటమునిగాయని, బాధితుల పునరావాసం కోసం అవసరమైన చర్యలు వెంటనే తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే.. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, నాలాలు పరిశీలించి, వాటి పునర్నిర్మాణం కోసం అధికారులను తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పారిశుధ్య పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. వరదల కారణంగా మురికినీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో ఫాగింగ్, చెత్త తొలగింపు, డ్రైనేజ్ శుభ్రత వంటి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పోంగులేటి సుధాకర్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా
మొంథా తుపాన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో మాట్లాడిన ఆయన,తుఫాన్ సంబంధిత సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని తెలిపారు.
అలాగే, తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఉపశమనం కల్పిస్తూ, పంట నష్టం పరిహారంగా ఎకరాకు రూ. 10,000 చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు.తుఫాన్ ప్రభావంతో ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాల ఆవేదనను విని, ప్రతి నష్టపోయిన గృహానికి రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. ప్రజల పునరావాసం, పునర్నిర్మాణం కోసం అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం అత్యవసర ప్రాధాన్యతతో చేపడుతుందని తెలిపారు.తుఫాన్ బాధితులను త్వరితగతిన ఆదుకోవడానికి, నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించింది.
