Let's talk: editor@tmv.in
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా మంత్రుల పర్యటనలు

మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా మంత్రుల పర్యటనలు

Dantu Vijaya Lakshmi Prasanna
31 అక్టోబర్, 2025

మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల మంత్రుల పర్యటనలు కొనసాగుతున్నాయి. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు భరోసా ఇస్తూ, తుఫాను బాధితులను పలకరిస్తూ, సహాయక చర్యల్లో అలసత్వం వుండకూడదని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

అమరావతిలో ముఖ్య మంత్రి అధికారులతో సమీక్ష

మొంథా తుఫాను నష్టo పై అధికారులతో చంద్రబాబు సమీక్ష జరిపారు. వరి, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన పంటల నష్టంపై 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనంతరం మొంథా తుఫానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, తుఫాను వల్ల పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే తుపాను బాధితులకు నిత్యావసరాలు, రూ.3 వేలు పరిహారం అందించారు.

అవనిగడ్డలో ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్

మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విసృతంగా పర్యటించారు. అవనిగడ్డ నియోజక వర్గం పులిగడ్డ వద్ద రోడ్ సైడ్ కూరగాయలు వ్యాపారం చేసుకునే వారిని, అక్కడ పరిసర ప్రజలను కలుసుకున్నారు. తుపాను ప్రభావం గురించీ, వారి కుటుంబ పరిస్థితి గురించి ఆరా తీశారు. ఒక వృద్దుడికి చెందిన దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి, ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే అవనిగడ్డ నియోయకవర్గం కోడూరు దగ్గర తుపాను మూలంగా దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ధైర్యం చెప్పారు.అందరికీ వేలయినంత త్వరగా ప్రభుత్వ సహాయ సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.

అలాగే మొంథా తుపానును ఎదుర్కున్నాం, ఇప్పుడు ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై, రోజువారి జీవనంపై పడకుండా చూడాలి. పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు ఏర్పాటు చెయ్యాలి. రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలి అన్నారు. తాగు నీరు సరఫరాకు ఇబ్బంది ఏర్పడిన చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు.అనంతరం కృష్ణా జిల్లా అవనిగడ్డలో తుపాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించారు.

వరదను పర్యవేక్షించిన **జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరిగేషన్ అధికారులతో కలసి కృష్ణా నది వరదను పర్యవేక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, ఉపనదులకు భారీ వరద వస్తుండటంతో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి అన్నారు. అలాగే ప్రకాశం బ్యారేజికి 6 నుండి 6.5లక్షల క్యూసెక్కుల కు పైగా వరద నీరు వస్తుండటంతో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

కృష్ణాడెల్టా పరిధిలో అధికారులు అందరూ క్షేత్రస్దాయిలో పర్యవేక్షిస్తూ, మందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి అన్నారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం,అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు పొంగుతుండంతో ఆయా జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గుండ్లకమ్మకు వస్తున్న వరద నీరు, తగ్గుతుండటం తో 70 వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చెయ్యాలని అధికారులకు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈరోజు అధిక వర్షలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వాగుల గట్లు, కాల్వ గట్లు పట్ల అప్రమతంగా ఉండాలి అన్నారు.

అలాగే భారీ వర్షాలకు పులిచింతల రిజర్వాయర్ కు వరద ఇన్ ఫ్లో 5లక్షల వరుకు చేరే అవకాశం ఉన్నందున ముందుగానే దిగువకు 4.9లక్షల క్యూసెక్కులు నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీని వలన ప్రకాశం బ్యారేజికి చేరిన వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. లోతట్టు ప్రాంత లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

కేంద్రం నుంచి ప్రధాని మోడీ పూర్తి భరోసా- మంత్రి సత్యకుమార్

జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన సీనియర్ ఐ ఎ.ఎస్ లు, కలెక్టర్ల నుంచి సేకరించిన వివరాలను తుపాన్ తీవ్రతకు అనుగుణంగా విశ్లేషిస్తూ సీఎం తీసుకున్న చర్యలవల్ల సత్ఫలితాలు కనిపించాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం నమోదుకు అనుగుణంగా కూడా సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు పరిపాలనారంగంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని చాటి చెప్పాయన్నారు. చంద్రబాబుతో ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడడమే కాకుండా వివరాల సేకరణ కోసం పీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటరును ఏర్పాటుచేశారని తెలిపారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా తనతో మాట్లాడారని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం భరోసా ఇచ్చిందని తెలిపారు.