Let's talk: editor@tmv.in
మొంథా తుపాను.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

మొంథా తుపాను.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

Shaik Mohammad Shaffee
27 అక్టోబర్, 2025

బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను రాష్ట్రంపై పెను ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ, ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు.

అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అక్టోబర్ 28 ఉదయానికి వాయుగుండం తీవ్రమైన తుపానుగా మారుతుందని సీఎం పేర్కొన్నారు. ఈ సమయంలో ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమాచార వ్యవస్థల సన్నద్ధత

మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేసిన సీఎం, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుపాను ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు

తీర జిల్లాలలో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తుపానుపై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా నిరంతరం విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించి, అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

మౌలిక సదుపాయాలు, పునరుద్ధరణ

విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని తెలిపారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుపాను రక్షణ కేంద్రాలకు తరలించి, పునరావాసం కల్పించాలని ఆదేశించారు. తుపాను తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. రహదారులు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు, కొమ్మలు తొలగించడానికి అవసరమైన పవర్ సా, క్రేన్‌లు, జేసీబీలు ప్రతీ సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, సహాయక చర్యల కోసం డ్రోన్లను కూడా వినియోగించాలని సీఎం సూచించారు.

అధికారుల సన్నద్ధత వివరాలు

తుపాను రక్షణ చర్యలపై ఇప్పటివరకు 11 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 851 జేసీబీలు, అలాగే 757 క్రేన్‌లు, పవర్ సాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాహనాలు సిద్ధం చేశామన్నారు.

రైతులు, మత్స్యకారుల రక్షణ

పంటనష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ, ఆర్టీజీ వ్యవస్థ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. ఇంకా సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్డ్ పడవలు, 37 మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రత్యేక అధికారుల నియామకం

మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రత్యేక అధికారులు తక్షణమే కేటాయించిన జిల్లాలకు చేరుకుని, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, సహాయ పునరావాస చర్యలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతి శాఖ, ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలని, ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాలని సీఎం స్పష్టం చేశారు.