
మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు రాజేంద్రనగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. శ్రీనివాస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానికంగా శాంతిభద్రతలను పరిరక్షించడంలో భాగంగా, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డీసీపీ రౌడీ షీటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకూడదని, ప్రజలతో శాంతియుతంగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అవసరం లేకుండా తిరగరాదని, బెదిరింపులు, వసూళ్లు లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యల్లో పాల్గొనరాదని హెచ్చరించారు. ప్రాంతంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు.
అదేవిధంగా, తమ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని, మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, సమాజంలో బాధ్యతగల పౌరులుగా జీవించాలని వారికి సూచించారు. గతంలో జరిగిన తప్పులను పునరావృతం చేయకుండా, సక్రమ మార్గంలో జీవించాలని అధికారులు ఆదేశించారు. కౌన్సెలింగ్ అనంతరం రౌడీ షీటర్లు భవిష్యత్తులో ఎలాంటి అనుచిత ఘటనల్లో పాల్గొనబోమని, చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంతంగా జీవిస్తామని పోలీసులకు హామీ ఇచ్చారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.
