
మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు: సీఎంకి అక్బరుద్దీన్ లేఖ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, మైనారిటీలకు ఇచ్చిన 'అభయ హస్తం' హామీలు ఇంకా కాగితాలకే పరిమితమయ్యాయని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ, మైనారిటీ డిక్లరేషన్‌లోని అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన అక్బరుద్దీన్ ఓవైసీ, మైనారిటీల సంక్షేమానికి సంబంధించిన హామీలను ఇక ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 5 తేదీతో ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేనిఫెస్టో అమలుపై సమీక్ష అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మైనారిటీ డిక్లరేషన్, ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టో ముఖ్యాంశాల్లోని హామీల అమలు స్థితిని పరిశీలించాలని సూచించారు.
మైనారిటీల ఆర్థికాభివృద్ధి, సాధికారత కోసం ప్రకటించిన అనేక హామీల్లో చాలా వరకు ఇప్పటికీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. కులగణన నిర్వహించినప్పటికీ ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రకటించిన గడువు దాటిపోయిందని చెప్పారు. అలాగే వెనుకబడిన వర్గాలు, మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలు, సంక్షేమ పథకాలలో సముచిత రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు.
మైనారిటీల సంక్షేమ బడ్జెట్‌ను రూ.4,000 కోట్లకు పెంచి ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్ ప్రవేశపెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే రెండు సంవత్సరాలు పూర్తయినా ఈ విషయంలో ఎలాంటి చర్యలు కనిపించలేదని అన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సంవత్సరానికి రూ.1,000 కోట్ల సబ్సిడీ రుణ పథకం కూడా అమలు కాలేదని చెప్పారు.
విద్యా రంగంలో ‘అబ్దుల్ కలాం తౌఫా-ఎ-తాలీమ్’ పథకం ద్వారా పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.5 లక్షలు, పీజీ పూర్తి చేసిన వారికి రూ.1 లక్ష, డిగ్రీ పూర్తిచేసిన వారికి రూ.25 వేల వంటి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించినా ఇప్పటివరకు అమలుపై స్పష్టత లేదన్నారు. అలాగే సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, వక్ఫ్ బోర్డు, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, హజ్ హౌస్, ఉర్దూ అకాడమీ వంటి సంస్థల్లో ఖాళీల భర్తీ కూడా జరగలేదని ఆయన పేర్కొన్నారు.
ఇమామ్లు, మౌజన్ల గౌరవ వేతనాన్ని రూ. 12,000లకు పెంచాలని, ఈ పథకాన్ని పాస్టర్లు, గ్రంథీలకు కూడా వర్తింపజేయాలన్న హామీని అమలు చేయాలన్నారు. అలాగే వక్ఫ్ భూముల రక్షణ, ముస్లిం సమాధులు, క్రైస్తవ సమాధుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మైనారిటీలకు ఇళ్ల స్థలాలు, గృహనిర్మాణ సహాయం అందిస్తున్న చర్యలను స్వాగతించిన ఆయన, షాదీ ముబారక్ పథకం కింద సహాయాన్ని రూ.1.6 లక్షలకు పెంచే హామీ కూడా అమలు చేయాలని కోరారు. రాబోయే ఎన్నికలకు ముందే ఈ హామీలను అమలు చేస్తే ప్రభుత్వ పనితీరు మెరుగ్గా కనిపిస్తుందని అక్బరుద్దీన్ ఓవైసీ తన లేఖలో పేర్కొన్నారు.
