
మైనారిటీల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్రంలో మైనారిటీ వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనారిటీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశభక్తికి, విద్య రంగానికి చిరునామా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్. ఆయన దేశంలో నాలెడ్జ్ ఎకానమీకి పునాది వేశారు. దేశ మొదటి విద్యా శాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. 1951లో మొట్టమొదటి ఐఐటీని స్థాపించింది ఆజాద్ గారే. ఆయన స్పూర్తితోనే విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తున్నాం అని పేర్కొన్నారు.
గతంలో టీడీపీ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ వర్సిటీని పెట్టామని, రాష్ట్ర విభజన తర్వాత దానిని కర్నూలులో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ ఏర్పాటు ఘనత కూడా టీడీపీదేనని తెలిపారు. హైదరాబాద్‌లో హజ్ యాత్రికుల కోసం హజ్ హౌస్ నిర్మించి, అక్కడి నుంచే విమానంలో మక్కా పంపే ఏర్పాటు చేశామని గత చర్యలను వివరించారు.
అదేవిదంగా మైనారిటీల సంక్షేమానికి 2025-26 బడ్జెట్‌లో రూ. 5,434 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను మైనారిటీలకు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మైనారిటీలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నారు. విద్యారంగంలో మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతో పాటు 175 మందిని డీఎస్సీ ద్వారా ఉర్దూ ఉపాధ్యాయులుగా నియమించారు. ఉపాధి అవకాశాల కోసం పీఎం వికాస్ పథకం కింద రూ.11 కోట్లతో 1,500 మందికి నైపుణ్య శిక్షణ ప్రారంభించారు. మత పెద్దలకు గౌరవ వేతనంగా ఇమామ్‌లకు రూ.10,000, మౌజన్‌లకు రూ. 5,000 చొప్పున, హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వెయ్యికి పైగా మసీదులు, చర్చిలు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, పునరుద్ధరణకు రూ.200 కోట్లు మంజూరు చేయనున్నట్లు సీఎం తెలిపారు. అదేవిదంగా నూర్ బాషా కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తామని, వక్ఫ్ ఆస్తులను రక్షిస్తామని,అర్హత కలిగిన ఇమామ్‌లందరినీ ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. అదనంగా నంద్యాల జిల్లాలో ముస్లిం ధార్మిక సమ్మేళనం ఇస్తెమా కార్యక్రమానికి రూ. 1.75 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి నగదు పురస్కారాలను అందించారు. మౌలానా ఆజాద్ జాతీయ పురస్కారం కింద రూ. 2.5 లక్షలు, అబ్దుల్ హక్ అవార్డు కింద రూ.1.25 లక్షలు, అదేవిదంగా రైజింగ్ స్పోర్ట్స్ పర్సన్ విభాగంలో నలుగురికి రూ.1 లక్ష చొప్పున బహుమతులు అందించారు. జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికైన 8 మందికి ₹25 వేలు చొప్పున, ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులు (71 మంది) ఉత్తమ విద్యార్థులకు (58 మంది) నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎమ్‌డి ఫరూక్, పలువురు ఎమ్మెల్యీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
