Let's talk: editor@tmv.in
మైనర్ అత్యాచార కేసులో ఒడిశా కోర్టు కఠిన శిక్ష

మైనర్ అత్యాచార కేసులో ఒడిశా కోర్టు కఠిన శిక్ష

Panthagani Anusha
31 అక్టోబర్, 2025

మైనర్‌లు, మహిళలపై జరిగే నేరాలపై రాష్ట్ర న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాన్ని ఇస్తూ ఒడిశాలోని కంధమాల్ జిల్లా ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. 16 నెలల క్రితం జరిగిన దోపిడీ, సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులకు కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

ఫుల్బాని ఫాస్ట్-ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కైలాష్ చంద్ర స్వైన్ ఈ తీర్పును వెలువరించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బనమాలి బెహెరా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఐదుగురు దోషులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, ప్రతి ఒక్కరూ రూ. 26,000చొప్పున జరిమానా చెల్లించాలి అని ఆదేశించింది. అంతేకాక జరిమానా చెల్లించడంలో విఫలమైతే శిక్ష కాలానికి అదనంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నిందితులందరూ దారింగ్‌బారి పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారే.

కేసు నేపథ్యం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ భయంకరమైన ఘటన ఏప్రిల్ 24, 2024 రాత్రి జరిగింది. ముసుగు ధరించిన ఐదుగురు నేరగాళ్లు తుపాకీ మరియు కత్తి వంటి ఆయుధాలతో బాధితురాలి ఇంట్లో చొరబడి, బంగారు ఆభరణాలు రూ. 50,000 నగదు దోచుకున్నారు. అనంతరం వారు మైనర్ బాలికను బలవంతంగా బయటకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇక ఘటనపై బాలిక తండ్రి మరుసటి రోజు ఫిరంగి యా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అన్ని ఆధారాలు సేకరించి నిందితులందరినీ వారు దాక్కున్న ప్రాంతాల నుంచి అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి జరిపిన విచారణలో 18 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

బాధితురాలికి పరిహారం

నేరగాళ్లకు శిక్షతో పాటు, బాధితురాలికి సత్వర సహాయం అందించాలని కోర్టు ఆదేశించింది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా బాధితురాలికి రూ. 6 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ చర్య నేరాల కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయ సహాయం అందించడంలో ప్రభుత్వ పాత్రను నొక్కి చెబుతుంది.