Let's talk: editor@tmv.in
మైనర్‌పై లైంగిక దాడి..కోచ్‌పై కేసు

మైనర్‌పై లైంగిక దాడి..కోచ్‌పై కేసు

Pinjari Chand
9 జనవరి, 2026

నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్ సమయంలో ఒక మైనర్ షూటర్‌పై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో భారత షూటింగ్ జట్టు కోచింగ్ సిబ్బందిలో ప్రముఖుడైన అంకుష్ భరద్వాజ్‌ను జాతీయ సమాఖ్య నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)సస్పెండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో భరద్వాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు అయినట్లు ఎన్ఆర్ఏఐ ధృవీకరించింది. మొహాలీ నివాసి అయిన భరద్వాజ్‌పై పోక్సో చట్టం సెక్షన్ 6 (తీవ్ర లైంగిక దాడి), భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351(2) (నేరపూరిత బెదిరింపులు) కింద కేసు నమోదు చేశారు.

భరద్వాజ్‌ను మేము సస్పెండ్ చేశాం. అతనికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేస్తామని ఎన్ఆర్ఏఐ కార్యదర్శి రాజీవ్ భాటియా పీటీఐకి తెలిపారు. నైతిక కారణాలపై అతడిని తొలగించాం. విచారణ పూర్తయ్యే వరకు అతడు ఎలాంటి కోచింగ్ కార్యకలాపాల్లోనూ పాల్గొనడు. నిర్దోషి అని అతడే నిరూపించుకోవాలని ఆయన చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత రూపొందించిన 37 మంది కోచ్‌ల జాబితాలో భరద్వాజ్ పేరును ఎన్ఆర్ఏఐ సిఫారసు చేయడంతోనే అతడిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) నియమించిందని భాటియా తెలిపారు. సూరజ్‌కుండ్‌లో జరిగిన ఈ ఘటన లైంగిక వేధింపుల కేసు అని ఆయన అన్నారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కోచ్‌లు, వ్యవస్థలపై విశ్వాసం పెట్టే యువ క్రీడాకారులు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొనకుండా చూడటం అందరి బాధ్యత అని వ్యాఖ్యానించింది.

ఎఫ్‌ఐఆర్‌లో బాధితురాలి ఆరోపణలు

బాధితురాలు తన ఎఫ్‌ఐఆర్‌లో తెలిపిన వివరాల ప్రకారం గత నెలలో కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్ సమయంలో ఈ ఘటన జరిగింది. 17 ఏళ్ల ఆ షూటర్, గత ఏడాది ఆగస్టు నుంచి భరద్వాజ్ వద్ద శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది. ఘటన తర్వాత తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె, జనవరి 1న తల్లి అడగడంతో నిజాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. సాధారణంగా శిక్షణ కోసం మొహాలీ, పటియాలా, డెహ్రాడూన్, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్లినా, అదే రోజున ఇంటికి తిరిగి వచ్చేదాన్నని ఆమె తెలిపింది. అయితే ఘటన జరిగిన రోజున, జాతీయ పోటీల కోసం ఒంటరిగా టాక్సీలో కర్ణి సింగ్ రేంజ్‌కు వెళ్లినట్లు పేర్కొంది. పోటీ ముగిశాక ఇంటికి వెళ్లబోతుండగా, ప్రదర్శన విశ్లేషణ పేరుతో అక్కడే ఉండమని కోచ్ కోరాడని ఆమె ఆరోపించింది. అనంతరం ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్ ప్రాంతంలోని ఒక హోటల్ గదికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని, వ్యతిరేకించగా తన క్రీడా భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తర్వాత భయంతో ఎవరికీ చెప్పలేకపోయానని, ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి పదేపదే అడగడంతో చివరకు నిజం చెప్పానని ఆమె తెలిపింది. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

గతంలో డోపింగ్ నిషేధం

భరద్వాజ్ ఒకప్పుడు పిస్టల్ షూటర్‌గా కూడా ఉన్నాడు. 2010లో పోటీల సమయంలో బీటా-బ్లాకర్ వాడినందుకు డోపింగ్ నిషేధం ఎదుర్కొన్నాడు. షూటింగ్, ఆర్చరీ, బిల్లియర్డ్స్ వంటి క్రీడల్లో బీటా-బ్లాకర్లు నిషేధితమైనవి.