
మైనర్‌తో వివాహం? చట్టం ముందు నేరమే:బాంబే హైకోర్టు
బాలిక వయస్సు 18 సంవత్సరాలలోపే శారీరక సంబంధం కలిగినంత మాత్రాన ఆమె అంగీకారంతో జరిగిందన్నా దానిని పోక్సో చట్టం ప్రకారం నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం మరొక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. మైనర్ బాలికతో వివాహం చేసుకున్నాడని పేర్కొంటూ, తనపై నమోదైన రేప్ కేసును కొట్టివేయాలన్న అభ్యర్థనను బాంబే హైకోర్టు స్పష్టంగా తిరస్కరించింది. పోక్సో చట్టం కింద నమోదైన ఆరోపణల నుంచి కేవలం వివాహం ఒక్కటే మినహాయింపు కలిగించదని, కోర్టు స్పష్టంచేసింది. ఈ కేసు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ బెంచ్ వద్ద విచారించబడింది. న్యాయమూర్తులు ఉర్మిళా జోషి ఫాల్కే, నందేశ్ దేశ్‌పాండేల అధ్యక్షతన ఈ తీర్పును ఇచ్చారు.
కేసు వివరాలు
29 ఏళ్ల వ్యక్తిపై, ఒక 17 ఏళ్ల మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో, పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది.ఆ బాలికను ఇతడు తరువాత వివాహం చేసుకున్నాడని, ఇప్పుడతని వివాహిత భార్యగా ఉన్నదని, వారికి ఒక బిడ్డ కూడా జన్మించిందని నిందితుడు కోర్టుకు వివరించాడు. నిందితుడు తన అభ్యర్థనలో, "ఇదంతా పరస్పర అంగీకారంతో జరిగిన విషయం. మేము ఆమె 18 సంవత్సరాలు పూర్తిచేసిన తర్వాతే వివాహం రిజిస్టరు చేశాము. కాబట్టి ఈ కేసును రద్దు చేయాలి" అని కోర్టులో వాదించారు.
కోర్టు వ్యాఖ్యలు:
హైకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. న్యాయమూర్తులు తెలిపిన వ్యాఖ్యల ప్రాకారం "పోక్సో చట్టం ప్రకారం, 18 ఏళ్ల లోపున్న బాలికతో జరిగిన శారీరక సంబంధం, ఆమె అంగీకారంతో జరిగినప్పటికీ, అది శిక్షార్హమైన దుష్కర్మమే. ఈ చట్టం బాలల రక్షణ కోసం రూపొందించబడినదిగా గుర్తించాలి. వివాహం అనే దాన్ని ఈ చట్టం కింద మినహాయింపుగా పరిగణించలేం."కాబట్టి, మైనర్ బాలికను వివాహం చేసుకున్నవాడన్న ఒక కారణంతో పోక్సో కేసును రద్దు చేయలేమని కోర్టు తేల్చి చెప్పింది.
పోక్సో చట్టం అంటే ఏమిటి?
పోక్సో చట్టం "బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం, 2012". ఇది భారతదేశంలో 18 సంవత్సరాల లోపు బాలబాలికలపై లైంగిక నేరాల నివారణ, విచారణ, శిక్ష కోసం రూపొందించిన ఒక ప్రత్యేక చట్టం. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన, సమగ్రమైనది, పిల్లల రక్షణకు కేంద్రంగా రూపొందించబడిన చట్టం. పోక్సో చట్టం ఉద్దేశ్యం బాలబాలికలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులు, అక్రమ చర్యల నుంచి రక్షణ కల్పించటం.బాధితులకు త్వరిత న్యాయం, మరియు నిందితులకు తగిన శిక్షలు విధించడం. బాలల మానసిక, శారీరక భద్రతను చట్టపరంగా బలోపేతం చేయడం జరుగుతుంది. 18 ఏళ్ల లోపు ఉన్న ఏ పిల్లోడు లేదా పిల్ల (పురుషుడు లేదా మహిళ) పోక్సో చట్టం పరిధిలోకి వస్తారు.ఇది లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, పోర్నోగ్రఫీకి లోనుచేసే చర్యలు, లైంగిక ఉద్దేశంతో మోసం చేయడం, బలాత్కారం మొదలైన నేరాలను కవర్ చేస్తుంది. లైంగిక వేధింపు శారీరక స్పర్శ లేకుండా జరుగే లైంగిక తలంపులు, మాటలు, చూపులు లైంగిక దాడులు శారీరకంగా స్పర్శ చేయడం, ముద్దుపెట్టడం, దుస్తులు తొలగించటం, అలాగే పిల్లల భద్రత దెబ్బతీసే ప్రవర్తన చేసిన వారికి కూడా శిక్షలు ఉన్నాయి.
పోక్సో చట్టంలో తాజా మార్పులు / సవరణలు:
కొన్ని సందర్భాల్లో బలాత్కారానికి మరణ శిక్ష అమలులో ఉంది (2019 సవరణల అనంతరం).అలాగే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా బాలలపై లైంగిక దాడులపై కూడా కఠిన చర్యలు ఉన్నాయి.
సామాజిక అవగాహన అవసరం:
పాఠశాలలు, కాలేజీలు, తల్లిదండ్రులు సమాజంలో,బాలికలపై జరిగే నేరలు వంటి అంశాలపై పిల్లలకు పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించడం అత్యవసరం. అలాగే చిన్నారులకి "గుడ్ టచ్ - బ్యాడ్ టచ్", సురక్షిత వ్యక్తులు ఎవరు? వంటి విషయాల్లో బోధన అవసరం ఉంటుంది.బాలల భద్రతకు కట్టుబడి ఉన్న చట్టమే పోక్సో.
