Let's talk: editor@tmv.in
మైదుకూరులో వైసీపీకి కొత్త బాస్ ?

మైదుకూరులో వైసీపీకి కొత్త బాస్ ?

FL - BRTH
22 అక్టోబర్, 2025

క‌డ‌ప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. ఇది 2024 ఎన్నిక‌ల ముందు మాట‌. 2024 ఎన్నిక‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ జెండా ఎగిరింది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి మైదుకూరు. మైదుకూరులో టీడీపీ గెలిచింది చాలా త‌క్కువ‌. గత ఎన్నిక‌ల్లో మాత్రం గెలిచింది. దీని వెనుక టీడీపీ వ్యూహం ఉంది. ఇప్పుడు ఆ వ్యూహానికి చెక్ పెట్టాల‌న్న‌ది వైసీపీ ప్ర‌తివ్యూహం.

మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ కీల‌క మార్పు దిశ‌గా ఆలోచిస్తోంద‌న్న చ‌ర్చ ఉంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి వైసీపీ ఇంచార్జీగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం లేదు. వ‌య‌సురీత్యా శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి పోటీలో ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే ఆయ‌న స్థానంలో కొత్త అభ్య‌ర్థి కోసం వైసీపీ అన్వేష‌ణ మొద‌లుపెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పోటీ చేశారు. మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి బీసీ అభ్య‌ర్థిగా గెలిచారు. ఆయ‌న గెలుపు వెనుక టీడీపీ వ్యూహం ఉంద‌న్న చ‌ర్చ ఉంది. ఎందుకంటే నియోజ‌క‌వ‌ర్గంలో యాద‌వ సామాజిక‌వ‌ర్గం ఓట్లు గెలుపోట‌ముల‌ను నిర్దేశించే స్థాయిలో ఉన్నాయి. అందుకే టీడీపీ రెడ్డి అభ్య‌ర్థికి బ‌దులుగా సుధాక‌ర్ యాద‌వ్ ను బ‌రిలోకి దింపింది. ఫ‌లితంగా గెలిచింది.

ఇదే వ్యూహానికి చెక్ పెట్టాల‌ని వైసీపీ ఆలోచిస్తోంది. శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి స్థానంలో బీసీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించాల‌ని భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ ను సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అన్ని స‌వ్యంగా జ‌రిగితే..త్వ‌ర‌లో ర‌మేష్ యాద‌వ్ ను మైదుకూరు వైసీపీ ఇంచార్జీగా ప్ర‌క‌టిస్తార‌న్న టాక్ ఉంది. ర‌మేష్ యాద‌వ్ ప్రొద్దుటూరులో ఉంటున్న‌ప్ప‌టికి.. ఆయ‌న సొంతూరు మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటుంది. అందులోనూ ఇటీవ‌ల పులివెందుల జ‌డ్పీటీసీ ఉపఎన్నిక‌ల్లో క్రియాశీల‌కంగా ప‌నిచేశారు. శాస‌న‌మండ‌లిలో వైసీపీ గొంతు బ‌లంగా వినిపించారు. వీటితో పాటు జ‌గ‌న్ కు చాలా ఏళ్లుగా న‌మ్మ‌క‌స్తుడిగా ఉంటున్నారు. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిసి ర‌మేష్ యాద‌వ్ అభ్య‌ర్థిత్వాన్ని ప‌రిశీలించ‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

ర‌మేష్ యాద‌వ్ ను బ‌రిలోకి దింపి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాల‌న్న‌ది వైసీపీ ప్ర‌తివ్యూహం. రెడ్డి అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌డం కంటే బీసీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపితే సానుకూల‌త ఉంటుంద‌ని వైసీపీ భావిస్తోంది. జిల్లాలో ఉన్న యాద‌వ సామాజిక‌వ‌ర్గంలో కూడా వైసీపీ ప‌ట్ల సానుకూల ప్ర‌భావం చూపుతుంద‌ని అంచ‌నా వేస్తోంది. త‌మ వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇచ్చార‌న్న భావ‌న కూడా యాద‌వుల్లో క‌లుగుతుంద‌ని వైసీపీ అభిప్రాయ‌ప‌డుతోంది. అందుకే వైసీపీ వ్యూహాత్మ‌కంగా ర‌మేష్ యాద‌వ్ అభ్య‌ర్థిత్వాన్ని ప‌రిశీలిస్తోంద‌ని తెలుస్తోంది.