Let's talk: editor@tmv.in
మే 24న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్.. ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి

మే 24న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్.. ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి

Shaik Mohammad Shaffee
6 ఫిబ్రవరి, 2026

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2026 నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 933 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఇందులో 33 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షలో పారదర్శకతను పెంచేందుకు కమిషన్ తొలిసారిగా 'ఫేస్ అథెంటికేషన్' (ముఖ గుర్తింపు) విధానాన్ని ప్రవేశపెట్టింది. మే 24న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

పకడ్బందీగా గుర్తింపు ప్రక్రియ

పరీక్షా కేంద్రాల్లో అవకతవకలకు తావులేకుండా ప్రతి అభ్యర్థికి ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అభ్యర్థులు తమ వెంట ఆధార్ కార్డును ఐడీగా తెచ్చుకోవాలని యూపీఎస్సీ సూచించింది. అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే ముందే కేంద్రానికి చేరుకోవాలని, అక్కడ ముఖ గుర్తింపుతో పాటు క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) చేస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలోనే లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు కొత్త నిబంధనలు

ఈసారి అర్హత ప్రమాణాల్లో కమిషన్ కీలక మార్పులు చేసింది. ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ హోదాలో పనిచేస్తున్న అధికారులు 2026 సివిల్స్ పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఒకవేళ ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఎవరైనా ఈ సర్వీసులకు ఎంపికైతే, వారు మెయిన్స్ పరీక్షకు హాజరుకాకూడదని స్పష్టం చేసింది. అలాగే, ప్రస్తుతం ఐపీఎస్‌గా ఉన్నవారు మళ్లీ అదే సర్వీస్‌ను ఎంచుకునే అవకాశం ఉండదు.

దరఖాస్తు విధానంలో మార్పులు

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు తెల్ల కాగితంపై నలుపు రంగు సిరాతో వరుసగా మూడుసార్లు సంతకం చేసి దానిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు సమర్పించిన తర్వాత, అందులో మార్పులు, సవరణలకు అవకాశం ఉండదని, అలాగే దరఖాస్తును ఉపసంహరించుకోవడానికి వీలుండదని కమిషన్ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ప్రశ్నాపత్రంపై అభ్యంతరాలకు గడువు తగ్గింపు

పరీక్షలో అడిగే ప్రశ్నలు లేదా కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసే సమయాన్ని యూపీఎస్సీ తగ్గించింది. గతంలో దీని కోసం ఏడు రోజుల సమయం ఉండగా, ఇప్పుడు దానిని ఐదు రోజులకు కుదించారు. ఓబీసీ అభ్యర్థులు 2022-23 నుండి 2024-25 ఆర్థిక సంవత్సరాల ఆదాయ ఆధారంగా జారీ చేసిన నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఏప్రిల్ 1, 2025 తర్వాత జారీ చేసినదై ఉండాలి.

ఏటా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరిగే ఈ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత స్థాయి అధికారులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 24లోపు అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా సమర్థవంతమైన అధికారులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఈ మార్పులు దోహదపడతాయని కమిషన్ భావిస్తోంది.