Let's talk: editor@tmv.in
మే 14న భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌

మే 14న భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌

Shaik Mohammad Shaffee
1 ఏప్రిల్, 2026

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మే 14, 15 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్.. మే నెలలో నిర్వహించనున్న విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆయన హాజరవుతారని రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో వెల్లడించారు. ఈ భేటీలో భారత్ నేతృత్వంలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ముసాయిదా పత్రాలు, తుది నిర్ణయాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా లావ్రోవ్ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు.

విస్తరిస్తున్న ‘బ్రిక్స్’ కూటమి

2006లో స్థాపితమైన బ్రిక్స్ కూటమిలో 2011లో దక్షిణాఫ్రికా చేరగా, 2024లో ఈజిప్ట్, ఇరాన్, యూఏఈ, ఇథియోపియాలు పూర్తిస్థాయి సభ్యత్వం పొందాయి. 2025లో ఇండోనేషియా చేరికతో కూటమి మరింత విస్తరించింది. గతేడాది నుంచి బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్‌లు భాగస్వామ్య హోదా పొందగా, ఈ ఏడాది జనవరి 17న నైజీరియా కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

వాణిజ్య లక్ష్యం @100 బిలియన్ డాలర్లు

భారత్-రష్యాల మధ్య సంబంధాలు సమానత్వం, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని లావ్రోవ్ కొనియాడారు. 2025లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు 60 బిలియన్ డాలర్లకు చేరుకుందని, 2030 నాటికి దీనిని 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విశేషమేమిటంటే, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో 96 శాతం సొంత కరెన్సీల్లోనే (రూపాయి-రూబుల్) జరుగుతుండటం గమనార్హం. లాజిస్టిక్స్, టెక్నాలజీ, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేస్తామని, ముఖ్యంగా అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్, ఉత్తర సముద్ర మార్గం అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామని ఆయన వివరించారు.

రష్యా పర్యటనకు ప్రధాని మోడీ

గత ఏడాది డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా కుదిరిన వ్యూహాత్మక ఒప్పందాలను లావ్రోవ్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 2026లో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు రానున్నారని, ఆయనకు స్వాగతం పలికేందుకు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న కాలపరీక్షకు నిలిచిన స్నేహం.. అంతర్జాతీయ సంబంధాలకు ఒక ఆదర్శమని లావ్రోవ్ ప్రశంసించారు.