
మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గృహ జాబితా, హౌస్ సెన్సస్ ప్రారంభం
జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గృహ జాబితా, హౌస్ సెన్సస్ ప్రక్రియను మే 1 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జనగణన ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె. నివాస్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలసి వివరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జనగణన నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, అమలు విధానం గురించి నివాస్ సీఎంకు వివరించారు.
జనగణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు నివాస్ వెల్లడించారు. మొదటి దశలో మే 1 నుంచి మే 30 వరకు గృహ జాబితా, హౌస్ సెన్సస్ నిర్వహిస్తారు. ఈ దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇళ్ల పరిస్థితి, గృహాల నిర్మాణం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాల అందుబాటు, అలాగే కుటుంబాలకు ఉన్న ఆస్తుల వివరాలు వంటి అంశాలను నమోదు చేస్తారు. ఈ సమాచారం ద్వారా రాష్ట్రంలోని గృహాల పరిస్థితిపై సమగ్ర డేటా అందుబాటులోకి వస్తుంది.
అదేవిధంగా ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు “సెల్ఫ్ సెన్సస్” సదుపాయం అందుబాటులో ఉంచనున్నట్లు నివాస్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక పబ్లిక్ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు.
జనగణన రెండో దశ 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. ఈ దశలో జనాభా లెక్కలు తీసుకుంటారు. ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, వలసల వివరాలు, కుటుంబాల్లో పిల్లల సంఖ్య వంటి అంశాలను ఈ దశలో నమోదు చేయనున్నారు. ఈ సమాచారం దేశ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి కీలకంగా ఉపయోగపడుతుంది.
ఈసారి నిర్వహించే 16వ జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్స్ ద్వారా డేటాను సేకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికోసం 16 భాషల్లో అందుబాటులో ఉండే హౌస్ లిస్టింగ్ యాప్‌ను కూడా రూపొందించింది. డిజిటల్ విధానం వల్ల డేటా సేకరణ వేగంగా, ఖచ్చితంగా జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
జనగణన ప్రక్రియ దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అత్యంత కీలకమైన గణాంక సర్వే. జనాభా, గృహాల పరిస్థితి, సామాజిక-ఆర్థిక స్థితిగతులు వంటి సమాచారం ఆధారంగా ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించేందుకు ఈ డేటా కీలకంగా ఉంటుంది.
