Let's talk: editor@tmv.in
మే నెలలో చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్

మే నెలలో చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Shaik Mohammad Shaffee
27 మార్చి, 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. మే 14, 15 తేదీల్లో ఆయన బీజింగ్‌లో పర్యటించనున్నట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ నెలాఖరులోనే ఆయన చైనా వెళ్లాల్సి ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆ పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు సర్దుమణిగే అవకాశం ఉండటంతో కొత్త తేదీలను ఖరారు చేశారు.

యుద్ధం ముగిశాకే పర్యటన?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో యుద్ధం తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యటన వాయిదాపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ.. "ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షుడు ఇక్కడే ఉండటం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా అర్థం చేసుకున్నారు. అందుకే పర్యటన వాయిదా విన్నపాన్ని ఆయన అంగీకరించారు" అని తెలిపారు. మరో 4 నుంచి 6 వారాల్లో యుద్ధం ముగియవచ్చని అమెరికా అంచనా వేస్తోంది. మే నెలలో జరగబోయే ఈ భేటీ కోసం ఇరు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

హార్ముజ్ దిగ్బంధం.. ఇంధన సెగ

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో యుద్ధం గల్ఫ్ ప్రాంతమంతటా పాకింది. దీంతో ప్రపంచానికి కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోయి, ఇంధన సరఫరా వ్యవస్థలు కుప్పకూలాయి. కొత్త అణు ఒప్పందం కోసం ఇరాన్‌పై ఒత్తిడి పెంచే క్రమంలో మొదలైన ఈ పోరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్-జిన్‌పింగ్ భేటీ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ఏడాది చివర్లో అమెరికాకు జిన్‌పింగ్

ట్రంప్ పర్యటన తర్వాత, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన సతీమణి పెంగ్ లియువాన్‌తో కలిసి ఈ ఏడాది చివర్లో అమెరికాలో పర్యటించనున్నారు. వీరికి వైట్ హౌస్‌లో ట్రంప్ దంపతులు ఆతిథ్యం ఇవ్వనున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన ఎపెక్ సదస్సు సందర్భంగా వీరిద్దరూ చివరిసారిగా కలుసుకున్నారు. "చైనాతో కలిసి పనిచేస్తున్నాం. షీ జిన్‌పింగ్‌ను కలవడానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను" అని ట్రంప్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.