Let's talk: editor@tmv.in
మేనకా గాంధీ బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

మేనకా గాంధీ బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

Gaddamidi Naveen
30 మార్చి, 2026

రాష్ట్రంలో జంతు సంక్షేమ చర్యలను మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఒక కీలక సమావేశం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం భేటీ అయ్యి, రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. రామకృష్ణారావు, క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో రాష్ట్రంలో అమలు అవుతున్న జంతు సంక్షేమ కార్యక్రమాల పురోగతిని అధికారులు వివరించారు. ముఖ్యంగా పట్టణ పరిధిలో తిరుగుతున్న వీధి కుక్కల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలు, వాటి సంరక్షణ, స్టెరిలైజేషన్ కార్యక్రమాలపై సవివరంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి

ఈ సందర్భంగా గోవుల సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ ప్రణాళికలపై ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికే గోసంరక్షణ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ఎన్కేపల్లి వద్ద ఆధునిక సదుపాయాలతో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. విస్తారమైన ప్రదేశంలో నిర్మించబడుతున్న ఈ గోశాలలో అత్యాధునిక సదుపాయాలు ఉండనున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని గోశాలలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా ఆలయాల సమీపంలో గోశాలలు ఏర్పాటు చేసి గోవుల సంరక్షణను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు వెల్లడించారు.

సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వం జంతు సంక్షేమం పట్ల చూపిస్తున్న చొరవ, నిబద్ధతపై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. వీధి జంతువుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తూనే, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ముఖ్యంగా గో సంరక్షణ కోసం చేపట్టిన ఆధునిక గోశాలల నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని అరికట్టేందుకు, పశుగ్రాసం వంటి మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని ప్రతినిధి బృందం సూచించింది.