
మేడ్చల్‌లోకాంగ్రెస్ దాడులను ఖండిస్తూ.. సీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
మేడ్చల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడులను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది గూండాలు కావాలనే ఉద్రిక్తత సృష్టించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూర్చున్న సమయంలో తమ ఇంటి ఎదుటకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుని గొడవకు దిగారని తెలిపారు. ప్రచార రథాల్లో భారీ శబ్దంతో పాటలు పెట్టి ఇబ్బందులు కలిగించారని, దీనిపై ప్రశ్నించగా పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశారని అన్నారు.
వజ్రేష్ యాదవ్ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని, పోలీసు అధికారులు అక్కడే ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని మల్లారెడ్డి విమర్శించారు. గన్‌మెన్లు లేకపోతే తమపై దాడి జరిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.
