Let's talk: editor@tmv.in
మేడారానికి పోటెత్తిన భక్తజనం

మేడారానికి పోటెత్తిన భక్తజనం

Gaddamidi Naveen
26 జనవరి, 2026

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం జాతర సమీపిస్తుండటంతో వనదేవతల సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివెళ్త్ళున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని, మొక్కుల రూపంలో బంగారం (బెల్లం) సమర్పించుకుంటున్నారు.

మేడారంకు భక్తులు ట్రాక్టర్లు, బస్సులు ప్రైవేటు వాహనాల్లో భారీగా రావడంతో మేడారం వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి. జాతర ముందే ఇంతటి జనసందోహం నెలకొనడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వనదేవతల నామస్మరణతో మేడారం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

మేడారం జాతర ప్రారంభానికి ముందే భక్తుల తాకిడి మొదలైంది. అధికారిక లెక్కలు వెల్లడి కానప్పటికీ, గడిచిన కొద్ది రోజుల్లోనే సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా. ప్రధాన జాతర రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరిగి, నాలుగు రోజుల వేడుకల్లో కోటి నుంచి కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని యంత్రాంగం భావిస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

మేడారంలో 'చిల్డ్రన్ ట్రాకింగ్ & మానిటరింగ్ సిస్టమ్'

మేడారం జాతరలో తప్పిపోయే చిన్నారులను, ఇతర భక్తులను త్వరగా గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. వొడాఫోన్ సహకారంతో ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ కింద క్యూఆర్‌ కోడ్‌ రిస్ట్ బ్యాండ్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ రిస్ట్ బ్యాండ్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే, సంబంధిత వ్యక్తి తల్లిదండ్రులు లేదా గార్డియన్ల వివరాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. లక్షలాది మంది హాజరయ్యే మేడారం జాతరలో భద్రత మరింత మెరుగుపడేందుకు ఈ వ్యవస్థ దోహదపడనుంది. ఈ సరికొత్త సదుపాయాన్ని తెలంగాణ డీజీపీ ప్రారంభించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.