
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు విస్తృత ఏర్పాట్లు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఈసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.251 కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.
జాతరలో ప్రధాన ఘట్టమైన గద్దెల ప్రాంగణాన్ని మరో 200 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్నారు.కేవలం గద్దెల విస్తరణ పనులకే రూ.101 కోట్లు కేటాయించారు. గద్దెల ప్రాంగణ నిర్మాణానికి 4,000 టన్నుల గ్రానైట్ ఉపయోగించబడుతుంది. 750 మంది కోయ వంశీయుల పేర్లతో సంబంధిత 7,000కి పైగా శిల్పాలను, 930 ఏళ్ల కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్ప రూపకల్పన చేయబడుతోంది. ప్రాంగణంలో 46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణం కలిగిన ప్రాకారం, 8 స్తంభాలతో వృత్తాకార గద్దె, 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, మరియు 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం నిర్మాణం జరుగుతోంది.
అభివృద్ధి పనులు చేయడం ప్రారంభించినప్పటికీ, ఉన్న చెట్లను తొలగించకుండా పునర్నిర్మాణం జరుగుతుంది. బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప వంటి 12 రకాల పవిత్ర వృక్షాలు, 140 రకాల ఆయుర్వేద మొక్కలు నాటబడ్డాయి. అన్ని పనులు పూజారుల సంఘం ఆమోదంతో, నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా రోజువారీ సమీక్షలతో కొనసాగుతున్నాయి.
ఈసారి మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరుగనుంది. కోటి మందికి పైగా భక్తులు పాల్గొనే అంచనాతో, వారికి సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రవాణా, పార్కింగ్, భోజన, వైద్య సదుపాయాలు, భద్రతతోపాటు ఇతర అవసరమైన ఏర్పాట్లను సమగ్రంగా సిద్ధం చేస్తున్నారు. ఈ సాంకేతిక, సాంస్కృతిక, పర్యావరణ పరిరక్షణ దృష్టితో చేపట్టిన మేడారం అభివృద్ధి కార్యక్రమం భక్తులకే కాక, భవిష్యత్ తరాలకు కూడా ఒక అద్భుతమైన వారసత్వంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
