Let's talk: editor@tmv.in
మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క

మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క

Gaddamidi Naveen
16 డిసెంబర్, 2025

ములుగు జిల్లా మేడారంలో కొలువైన ఆదివాసీ ఆరాధ్య దైవాలు సమ్మక్క, సారక్కలను రాష్ట్ర మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

దర్శనానంతరం మంత్రి సీతక్క మేడారం దేవాలయం పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తులకు అవసరమైన మౌలిక వసతులు తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి శాలలు, రహదారులు, విద్యుత్ సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భద్రత, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క, సారక్క జాతరకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అభివృద్ధి తోరణం సిద్ధమవుతోంది. వచ్చే జనవరి నెలలో ప్రారంభం కానున్న ప్రపంచ ప్రఖ్యాత మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

సమ్మక్క, సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్, రాతి స్తంభాల స్థాపన, జంపన్నవాగు వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో జ‌రుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రాబోయే వందేళ్ల పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనుల వేగం పెంచి జాతర ప్రారంభం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. దాదాపు కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే ఈ జాతరకు 50 కిలోమీటర్ల పరిధిలో విస్తృత అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క - Tholi Paluku