Let's talk: editor@tmv.in
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు భారీ ఏర్పాట్లు

మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు భారీ ఏర్పాట్లు

Gaddamidi Naveen
19 జనవరి, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం జరిగిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రివర్గ సహచరులతో కలిసి ఆయన బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, జాతరకు రాబోయే లక్షలాది భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.

జాతర భద్రత, మానవజాతి పర్యవేక్షణకు అనుగుణంగా పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల వినియోగం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షించారు. ఏఐ సాంకేతికతతో కెమెరాల పనితీరును పోలీసులు వివరించారు. భద్రతా ఏర్పాట్లలో పోలీస్ ఉన్నతాధికారుల సమగ్రత, సమయానికి సమాచార నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టారు.

అలాగే, దాదాపు వెయ్యేళ్ల వారసత్వ చరిత్ర, జాతి సంపదకు అద్దం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని రాతి ప్రాకారాలు, శిలాతోరణాలతో పునరుద్ధరించిన పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ముఖ్యంగా మూలవాసులైన కోయ తెగల సంప్రదాయ ఆచారాలను కట్టుదిట్టంగా ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ప్రాంగణాన్ని ఆసాంతంగా పరిశీలించారు.

దాదాపు 250 కోట్ల రూపాయల వ్యయంతో గత కొన్ని సంవత్సరాలలో శరవేగంగా పూర్తికాబోతున్న ఈ పనులన్నీ మేడారం మహాజాతరను సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించడానికి కేంద్ర బిందువుగా మారనున్నాయి. ముఖ్యమంత్రి ఒక్కొక్క అంశాన్ని పరిశీలించారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర - 2026కు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సుమారు 3 కోట్ల మంది భక్తులు జాతరకు తరలివస్తారని అంచనా వేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. సీనియర్ అధికారులు ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాల్లో మకాం వేసి పర్యవేక్షణ చేపట్టారు.

జాతరను సజావుగా నిర్వహించేందుకు జాతరను సజావుగా నిర్వహించేందుకు మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించారు. 21 ప్రభుత్వ శాఖలకు చెందిన 42,027 మంది సిబ్బందితో పాటు, 2,000 మంది ఆదివాసీ వాలంటీర్లు సేవలందించనున్నారు. భక్తుల భద్రత కోసం 210 మంది ఈతగాళ్లు, 100 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 15 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి.

సంప్రదింపుల కోసం 27 శాశ్వత, 33 తాత్కాలిక మొబైల్ టవర్లు, 450 వీహెచ్ఎఫ్ సెట్లు ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యాల కోసం 42 పార్కింగ్ ప్రాంతాలు (1,418 ఎకరాలు) సిద్ధం చేయగా, 4,000 టీఎస్‌ఆర్టీసీ బస్సులతో 51,000 ట్రిప్పులు, 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

భక్తుల సౌకర్యార్థం 5,482 తాగునీటి పాయింట్లు, జంపన్న వాగు వద్ద 119 డ్రెస్సింగ్ రూములు, 5,700 మరుగుదొడ్లు, 5,000 మంది పారిశుధ్య సిబ్బంది ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాకు 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, అత్యవసర అవసరాలకు 28 బ్యాకప్ జనరేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ 5,192 వైద్య సిబ్బంది, 30 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు, 50 పడకల ఆసుపత్రి, ప్రతిరోజూ 30 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 268 అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉంటారు.

మీడియా అవసరాల కోసం ఆధునిక అడ్వాన్స్‌డ్ మీడియా సెంటర్ ఏర్పాటు చేసి, 100+100 ఏంబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్, 20 హైఎండ్ కంప్యూటర్లు సహా అన్ని సదుపాయాలు కల్పించారు. భక్తుల భద్రత, గౌరవం, సౌకర్యమే లక్ష్యంగా మేడారం మహా జాతర–2026ను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక వేడుకగా విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి31 వరకు జరగనుంది.