Let's talk: editor@tmv.in
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

Gaddamidi Naveen
24 జనవరి, 2026

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026ను భక్తులు సురక్షితంగా, సౌకర్యంగా దర్శించుకునేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) విస్తృత రవాణా ఏర్పాట్లు చేపట్టింది. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు ముందుగానే జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సు సేవలను అందించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, హైదరాబాద్‌ నగరం సహా మొత్తం 4,000 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను మేడారానికి నడపనున్నారు. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో 51 ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లను గుర్తించి, అక్కడి నుంచి నిరంతర బస్సు సదుపాయం కల్పిస్తున్నారు.

భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు 50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 9 కిలోమీటర్ల పొడవుతో 50 క్యూలైన్లు ఉండగా, ఒకేసారి సుమారు 20 వేల మంది ప్రయాణికులు నిలిచేలా ఏర్పాట్లు చేశారు. అలాగే 25.76 ఎకరాల్లో వెయ్యి బస్సులు పార్కింగ్‌ చేసే సౌకర్యం కల్పించారు.

ఈ మహాజాతర విధుల నిర్వహణకు 10,441 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో డ్రైవర్లు, కండక్టర్లు, భద్రతా సిబ్బంది, అధికారులు ఉన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత కోసం 76 సీసీ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, పెట్రోలింగ్‌ జీపులు, ద్విచక్ర వాహనాలను అందుబాటులో ఉంచారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల సుమారు 20 లక్షల మంది మహిళా భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నట్లు అంచనా. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక బస్‌ స్టేషన్‌ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్సుల ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరను భక్తులందరికీ సురక్షితంగా, సవ్యంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్‌ఆర్టీసీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాయని అధికారులు తెలిపారు. భక్తులందరికీ మేడారం జాతరను ఒక మధుర జ్ఞాపకంగా మార్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, టీజీఎస్‌ఆర్‌టీసీ సర్వసన్నద్ధమయ్యాయి.