Let's talk: editor@tmv.in
మేడారం.. వనం నుంచి జనంలోకి

మేడారం.. వనం నుంచి జనంలోకి

Pinjari Chand
30 జనవరి, 2026

శివసత్తుల పూనకాలతో, అమ్మవార్ల నామస్మరణతో రెండో రోజు అడవంతా శివమూగింది. మేడారం గిరి ‘జన’ జాతర తరలివచ్చిన లాక్షలాది భక్తులతో పొటెత్తింది. తరలివచ్చిన వారితో గద్దెల ప్రాంగణం నిండిపోయింది. క్యూలైన్లు, జంపన్నవాగు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆదివాసీ–గిరిజన సంస్కృతీతో వాతావరణం ఒక్కసారిగా సంద్రంగా మారిపోయాయి. డోలు మోతలు.. కొమ్ము బూరల చప్పుళ్లతో పరిసరాలు మార్మోగిపోయాయి.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో ఈసారి భక్తుల రద్దీ రికార్డు స్థాయికి చేరింది. జాతర రెండో రోజైన గురువారం ఒక్కరోజులోనే దాదాపు 80 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క చిలకలగుట్ట వీడి జనంలోకి వచ్చే సమయంలో ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు గౌరవవందనం సమర్పించారు. సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటిని దాటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ సహా పలు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

శాశ్వత అభివృద్ధికి విస్తృత ప్రణాళిక

మేడారం జాతర శాశ్వత అభివృద్ధి కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమి సేకరణ పూర్తయిందని, మరో 41 ఎకరాల భూసేకరణ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. మొత్తం సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు, కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి రూ.2,500 కోట్ల వ్యయంతో బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అలాగే జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా రామప్ప–లక్నవరం–జంపన్న వాగు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్ట్‌కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

మేడారానికి ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించామని, దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కులు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపడతామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను భక్తులు నమ్మవద్దని మంత్రి కోరారు. వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు శనివారం సాయంత్రం 4 గంటలకు గద్దెల నుంచి వనప్రవేశం చేయనున్నట్లు వెల్లడించారు.

జాతీయ పండుగగా గుర్తించాలన్న డిమాండ్

సమ్మక్క–సారలమ్మ మహాజాతరను జాతీయ పండుగగా ప్రకటించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి జాతర నిర్వహిస్తున్నామని, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ గిరిజన మహోత్సవానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

సమ్మక్క–సారలమ్మ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, పరిమాణం, ప్రాధాన్యతలో కుంభమేళాకు సమానమని మంత్రి వ్యాఖ్యానించారు. జాతర విజయవంతానికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి, అన్ని శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 90 రోజుల్లోనే ఆలయ అభివృద్ధి పనులు, కీలక మౌలిక వసతులు పూర్తయ్యాయని తెలిపారు. జాతర ప్రశాంతంగా, సాఫీగా కొనసాగుతోందని పేర్కొని జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, గద్దెల పునర్నిర్మాణం సహా అన్ని మౌలిక వసతుల పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యాయని చెప్పారు. జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని, కేంద్రం నుంచి అధిక ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

కేంద్ర మంత్రుల పర్యటన

జాతర రెండో రోజున కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం మేడారానికి విచ్చేశారు. అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. జాతర ఏర్పాట్లు కుంభమేళాను తలపిస్తున్నాయని వారు ప్రశంసించారు. మేడారం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మొక్కులు చెల్లించారు.

పకడ్బందీ ఏర్పాట్లు

వైద్య, పారిశుధ్య చర్యలు పకడ్బందీగా కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్షణ వైద్య సహాయం, తప్పిపోయిన భక్తుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యర్థాల తొలగింపు, శానిటేషన్ పనులు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏర్పాట్లను మంత్రులు, జిల్లా కలెక్టర్‌, అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.