
మేడారం మహా జాతర 2026: పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఉత్సవం, 'తెలంగాణ కుంభమేళా'గా పిలవబడే మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర - 2026కు ముహూర్తం ఖరారైంది. ఈ జాతరకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. మహా జాతర 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
2026 ఏడాదిలో జరిగే ఈ మహా జాతర నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్, అడ్డంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని నేతలు పేర్కొన్నారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. ఆదివాసీ సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతిరూపమైన ఈ వేడుకలో వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను భక్తులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రవాణా, తాగునీరు, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మేడారం మహా జాతర–2026ను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని ఆయన అన్నారు.
