
మేడారం మహా జాతరకు సమగ్ర వైద్య ఏర్పాట్లపై మంత్రి దామోదర్ సమీక్ష
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే కోట్ల మంది భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన వైద్య ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అత్యవసర సమయాల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన సన్నద్ధతను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం సమీక్షించారు.
జాతర ప్రధాన కేంద్రంగా ఉన్న మేడారంలో మొత్తం మూడు ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. వీటిలో మేడారం ప్రధాన శిబిరంలో 50 పడకలతో కూడిన 3 పెద్ద ఆసుపత్రి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చికిత్స అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని సిద్ధం చేశామని ఆయన తెలిపారు. అదేవిధంగా జాతర ప్రాంతంలో, పరిసర గ్రామాల్లో మొత్తం 30 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు.
భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి మేడారానికి తరలివచ్చే మార్గాల్లోనూ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. మేడారానికి వచ్చే ఎనిమిది ప్రధాన మార్గాలపై మొత్తం 42 మార్గమధ్య మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో అనారోగ్యం, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేందుకు 35 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. “గోల్డెన్ అవర్”లో ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఈ అంబులెన్స్ సేవలు పనిచేస్తాయని మంత్రి తెలిపారు.
జాతర వైద్య ఏర్పాట్ల కోసం మొత్తం 3,199 మంది వైద్య సిబ్బందిని నియమించారు. ఇందులో 544 మంది వైద్యులు ఉండగా, వీరిలో 72 మంది నిపుణ వైద్యులు, 42 మంది మహిళా వైద్యులు ఉన్నారు. వీరికి తోడుగా 2,150 మంది పారా మెడికల్ సిబ్బంది సేవలు అందించనున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బాలల మందులతో పాటు సర్పదంషణ చికిత్సకు అవసరమైన యాంటీ-స్నేక్ వెనమ్ సహా మొత్తం 248 రకాల మందులను నిల్వ ఉంచారు.
జనవరి 25 నుంచి అన్ని వైద్య శిబిరాలు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. అయితే ఇప్పటికే భక్తుల రాక ప్రారంభమవడంతో గద్దెలు, జంపన్న వాగు, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతాల్లో కొన్ని మెడికల్ క్యాంపులు ముందుగానే సేవలు ప్రారంభించాయి. భక్తులు తమ ఇంటి నుంచి బయలుదేరిన క్షణం నుంచి సురక్షితంగా తిరిగి చేరేవరకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్‌తో పాటు ములుగు జిల్లా ఆసుపత్రిని 24×7 అప్రమత్త స్థితిలో ఉంచారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ జరిపి, ఎలాంటి లోపాలు లేకుండా వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమగ్ర వైద్య కవరేజీని అమలు చేస్తోంది.
