Let's talk: editor@tmv.in
మేడారం భక్త ‘జనసంద్రం’

మేడారం భక్త ‘జనసంద్రం’

Gaddamidi Naveen
29 జనవరి, 2026

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా, మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ములుగు జిల్లాలోని అడవి ప్రాంతం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగుతోంది. జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ గిరిజన కుంభమేళాకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

సారలమ్మ రాకతో ఆధ్యాత్మిక శోభ

ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం జాతరలో మొదటి రోజున వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు తండోపతంwడాలుగా తరలివచ్చారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అమ్మవార్లకు చీరలు, సారెలు, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన భక్తులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చి గద్దెపై కొలువుదీరుస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గిరిజన సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాల నడుమ భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

తప్పిపోకుండా 'జియో ట్యాగింగ్' భద్రత

భారీ భక్తజన సందోహాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు, జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టాయి. మేడారం జాతరకు వచ్చే భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, జాతరలో తప్పిపోకుండా ఉండేందుకు చైల్డ్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ బ్యాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ట్రాకింగ్ బ్యాండ్లు భక్తుల భద్రతకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద జియో ట్యాగింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాజీపేట రైల్వే స్టేడియంలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ట్రాకింగ్ బ్యాండ్లు వేసే కార్యక్రమంలో డీసీపీ దార కవిత స్వయంగా పాల్గొన్నారు. ఈ విధానంపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని, పిల్లల భద్రత కోసం తప్పనిసరిగా ఈ బ్యాండ్లను వినియోగించాలని సూచించారు.

వనదేవతల ఆశీస్సుల కోసం లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలిరావడంతో ఈ ప్రాంతం భక్తిశ్రద్ధలతో వెల్లివిరుస్తోంది. సంప్రదాయం, భక్తి, భద్రత సమన్వయంగా కొనసాగుతున్న మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర తెలంగాణ గర్వకారణంగా నిలుస్తోంది.

మేడారం భక్తులకు ఇబ్బందులు కలగొద్దు: అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశం

శ్రీ సమ్మక్క, సారలమ్మ మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలోని తన కార్యాలయంలో విపత్తుల నిర్వహణ విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్‌డీఆర్ఎఫ్, హైడ్రా, ఐసీసీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడారం మహాజాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా సచివాలయం నుంచి వాకిటాకీ ద్వారా మేడారంలో విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తొలి రోజు కావడంతో భక్తుల సంఖ్య, సారలమ్మ వార్ల రాకకు ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జాతరను ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తాగునీరు, రవాణా వంటి మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.