Let's talk: editor@tmv.in
మేడారం జాతరకు రండి.. గవర్నర్‌‌కు మంత్రుల ఆహ్వానం

మేడారం జాతరకు రండి.. గవర్నర్‌‌కు మంత్రుల ఆహ్వానం

Gaddamidi Naveen
6 జనవరి, 2026

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రులు ఆహ్వానించారు. సోమవారం లోక్ భవన్‌లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ మేడారం ఆలయ పూజారులు గవర్నర్‌ను కలిసి అధికారికంగా జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు.

మేడారం ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజారులు, ఈవో వీరస్వామి గవర్నర్‌కు ఆహ్వానం పలికారు. గిరిజన ఆచారాలను ప్రతిబింబించేలా ఈ ఆహ్వాన ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా మంత్రులు మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గవర్నర్‌కు వివరించారు.

సమ్మక్క, సారలమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రభుత్వం చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనులు, ఆలయ పునర్నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాల గురించి మంత్రులు గవర్నర్‌కు క్లుప్తంగా వివరించారు. ఈ మహా జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, దేశవిదేశాల నుంచి వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జాతర ఏర్పాట్లపై ఆసక్తి చూపుతూ, ప్రభుత్వ చర్యలను అభినందించారు.ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ జాతర కోసం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

మేడారం జాతరకు రండి.. గవర్నర్‌‌కు మంత్రుల ఆహ్వానం - Tholi Paluku