Let's talk: editor@tmv.in
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యత ముఖ్యం: సీఎం

మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యత ముఖ్యం: సీఎం

Gaddamidi Naveen
2 డిసెంబర్, 2025

మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పక పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ప్రధానంగా అభివృద్ధి పనుల్లో ఏ విధమైన పొరపాటు జ‌రిగిన‌ సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్చరించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొని, మేడారం అభివృద్ధి ప్రాజెక్ట్ పురోగతిపై సమగ్రంగా చర్చించారు. పనులు సాగుతున్న తీరుపై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి, పలు విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.అలాగే రాతి పనులు, రహదారుల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు అనుకూలమైన మార్గాలు, భక్తులు వేచి ఉండే ప్రదేశాల ఏర్పాట్లపై ప్రతీ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు.పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని ఉద్ఘాటించారు.

ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, స్థాపతి శివనాగిరెడ్డి సమన్వయంతో అన్ని పనులు సమర్థవంతంగా కొనసాగించాలని సీఎం సూచించారు. అభివృద్ధి పనులలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి మరల పేర్కొన్నారు. నిర్దేశిత సమయానికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.మేడారం ప్రాంత అభివృద్ధిలో భక్తుల సౌకర్యం, రహదారి విద్యుత్ సౌకర్యాలనుంచి ప్రారంభమైన పనులు సమగ్రంగా, నాణ్యత ప్రమాణాలతో జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన ఈ సమీక్ష, ప్రాంతీయ అభివృద్ధికి ప్రాణప్రదమైన నిర్ణయంగా నిలిచింది.