
మేడారంలో గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరిగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నూతన గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు.
ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గోవిందరాజును ఈ ఉదయం 6 గంటలకు పూజారులు ప్రత్యేక పూజల మధ్య ప్రతిష్ఠించారు. అనంతరం ఉదయం 9.45 గంటలకు పగిడిద్దరాజును గద్దెలపై పూజారులు ప్రతిష్ఠించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భక్తులను గద్దెల ప్రాంగణంలోకి రానివ్వకుండా భద్రత ఏర్పాట్లు చేపట్టారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతో పాటు హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.
దేవతల ప్రతిష్ఠతో మేడారం జాతర సందడి మరింత ఉత్సాహంగా మారింది. రానున్న రోజుల్లో భక్తుల రాక భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తాగునీరు, వైద్య సేవలు, రవాణా, భద్రత వంటి సౌకర్యాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మేడారం గడ్డపై మరోసారి ఆదివాసీ సంప్రదాయాల వైభవం కనువిందు చేస్తోంది.
మేడారం జాతరకు ‘జాతీయ హోదా’ కల్పించండి: ప్రధాని మోదీకి మంత్రి సీతక్క విజ్ఞప్తి
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనంగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని మంత్రి సీతక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ములుగు జిల్లాలో జనవరి చివరిలో నిర్వహించనున్న మహా జాతర నేపథ్యంలో ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. గిరిజన సంప్రదాయాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిధులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ చారిత్రక ఆదివాసీ పండుగకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలని కోరారు.
నిధుల కేటాయింపులో వివక్షపై ధ్వజం
జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మేడారం (ములుగు జిల్లా)లో సమ్మక్క–సారలమ్మ జాతర ఘనంగా జరగనుంది. లక్షలాది కాదు, కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహా సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లను కేటాయించిందని మంత్రి సీతక్క తెలిపారు. మౌలిక వసతులు, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే ఇంతటి మహత్తర గిరిజన జాతరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని ఆమె విమర్శించారు. ఇతర జాతీయ స్థాయి పండుగలకు కేంద్రం వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ, గిరిజన పండుగల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
జాతీయ హోదా లభిస్తే ఈ ప్రాచీన ఆదివాసీ సంప్రదాయానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ప్రపంచ దృష్టిని ఆకర్షించగలదని సీతక్క అన్నారు. అన్యాయమైన పన్నులపై తల్లి,కూతురు చేసిన పోరాటాన్ని స్మరించుకునే ఈ జాతరకు ప్రత్యేక చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉందని ఆమె వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్
ఇదే అంశంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2026 జనవరిలో జరిగే మేడారం మహా జాతర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని, జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరారు. మంగళవారం జరిగిన ప్రజాసభలో మాట్లాడిన సీఎం, కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్న కేంద్రం, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర పట్ల నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు.
అదేవిధంగా, గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం మేడారం ఆలయ అభివృద్ధిలో వివక్ష చూపిందని సీఎం విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ దేవతల ఆశీస్సులతోనే తాను పాదయాత్ర ప్రారంభించి గత ప్రభుత్వాన్ని గద్దె దించానని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఐటిడీఏ ప్రాంతాల్లో అదనపు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
మహా జాతర ప్రారంభానికి ముందే అన్ని నిర్మాణ పనులు పూర్తిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈసారి మేడారం జాతరను ఘన విజయంగా నిలపాలని స్థానికుల సహకారాన్ని కోరారు.
