Let's talk: editor@tmv.in
మేడారంలో ఆర్టీసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌‌ను ప్రారంభించిన‌ మంత్రులు

మేడారంలో ఆర్టీసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌‌ను ప్రారంభించిన‌ మంత్రులు

Gaddamidi Naveen
25 జనవరి, 2026

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తుల రవాణా సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ మేడారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భారీ తాత్కాలిక బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలిసి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు బస్టాండ్ ఏర్పాట్లు, భద్రత, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.

ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో సుమారు 4 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భక్తుల రద్దీ మరింత పెరిగితే పరిస్థితిని బట్టి అదనపు బస్సులను కూడా కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో బస్సులు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

మేడారం జాతరకు వచ్చే మహిళా భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదని మంత్రి వెల్లడించారు. ఇది మహిళలకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అలాగే బస్టాండ్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు వంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

బస్టాండ్ ప్రారంభం అనంతరం మంత్రులు సమ్మక్క–సారలమ్మ, అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ ఏర్పాట్లతో మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందుతుందని అధికారులు తెలిపారు.

మేడారంలో ఆర్టీసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌‌ను ప్రారంభించిన‌ మంత్రులు - Tholi Paluku