
మేఘాలయ బొగ్గు గని కార్మికుల మృతి ఘటనలో ఎన్‌జీటీ నోటీసులు
మేఘాలయ రాష్ట్రం ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న ‘రాట్-హోల్’ బొగ్గు గనిలో పేలుడు సంభవించి 30 మంది కార్మికులు మరణించిన ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న అనధికార గనిలో డైనమైట్ వినియోగం కారణంగా పేలుడు జరిగిందన్న వార్తాపత్రిక కథనాన్ని స్వయంగా (సుమోటో) పరిగణనలోకి తీసుకున్న ఎన్‌జీటీ, ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు ఏ. సెంథిల్‌వెల్‌లతో కూడిన ధర్మాసనం,“ఈ ఘటన జూలై 2021 తర్వాత జరిగిన అతిపెద్ద గనుల దుర్ఘటనల్లో ఒకటి. రెండేళ్ల క్రితమే ఈ ప్రమాదకర గనుల విధానాన్ని ఎన్‌జీటీ నిషేధించిందని పేర్కొంది.
2014 ఏప్రిల్‌లో బొగ్గు తవ్వకాలు, రవాణాపై ఎన్‌జీటీ విధించిన సంపూర్ణ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించినప్పటికీ, రాజకీయ నాయకులు, ప్రభావశీలుల మద్దతుతో అక్రమ గనుల యజమానులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని కార్యకర్తలు ఆరోపించినట్లు ధర్మాసనం గమనించింది. ఈ ఘటన ఎన్‌జీటీ ఆదేశాల ఉల్లంఘనను సూచిస్తోంది. అలాగే ఎయిర్ (కాలుష్య నియంత్రణ) యాక్ట్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టాల ఉల్లంఘనల అంశాలు ఇందులో ఉన్నాయి. పర్యావరణ నిబంధనల అమలుపై గంభీర ప్రశ్నలు తలెత్తుతున్నాయని ట్రైబ్యునల్ పేర్కొంది. ఈ కేసులో మేఘాలయ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ), కేంద్ర పర్యావరణ–అటవీ–వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ షిల్లాంగ్ ప్రాంతీయ కార్యాలయం, ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చింది. మే 19న జరిగే తదుపరి విచారణకు కనీసం వారం ముందు అఫిడవిట్ రూపంలో సమాధానం దాఖలు చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.
